పుట:AntuVyadhulu.djvu/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

2. రక్షణశక్తి (Immunity)

ఒకానొక అంటువ్యాధి రాదగిన అవకాశములన్నియు నున్నను, ఆ వ్యాధిని మనకంటకుండ జేయుశక్తికి రక్షణశక్తి యని పేరు. ఇట్టి రక్షణశక్తి మనకు గలదను విషయము చిరకాలమునుండి ప్రజలకు కొంతవరకు తెలిసియున్నదని చెప్పవచ్చును. ఒక్కసారి మశూచకము వచ్చినవానికి తిరిగి మశూచకమురాదని మనవారల కందరకు తెలియదా? ఇట్లొకసారి మశూచకము వచ్చినవానికి తిరిగి మశూచకము రాకుండుటకే వానికి రక్షణశక్తికలదని చెప్పుదుము. ఇట్టి రక్షణశక్తి మశూచకమునకేగాక యింకనుకొన్ని ఇతరవ్యాధులకును గలదు. ఒకసారి వ్యాధి వచ్చిపోవుటచేతనేగాక ఇతర కారణములచేత కూడ మన రక్షణశక్తి కలుగవచ్చును.

మన చుట్టుప్రక్కలను, మన శరీరముమీదను, మన పేగులలోను, నోటియందును, ముక్కులందును, ఊపిరి పీల్చు గాలియందును సూక్ష్మజీవులు కోట్లు కోట్లుగా నున్నవని చెప్పియున్నాము. మన శరీరములో ప్రాణమున్నంతకాలము మన కేమియు అపకారముచేయలేని సూక్ష్మజీవులు ప్రాణము పోయినవెంటనే శరీరమును నాశనము చేయుటకు ప్రారంభించి