పుట:AntuVyadhulu.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

రెండవప్రకరణము

ఇక్కడనుండి వంటగది; ఈ గదిలో ఒకమూల పాలదాలి; బూడిదకుప్ప అరగజము ఎత్తయినను పెరుగువరకు ప్రక్కనే యుండును. దానిప్రక్కను చిట్టటకబల్ల. దానిక్రిందనూనె డబ్బాను పెట్టుకొను గూడు లేక నూనెసీసాను తగిలించు చిలక కొయ్య, దీనినుండి నూనె కారికారి గూటి మైనము ఏర్పడును. ఆ బల్లవద్ద కంపు ప్రతిదినము అక్కడనుండువారి ముక్కులకు తెలియదు. క్రొత్తవార లక్కడకు వెళ్లిన యెడల దానినిభరింపజాలరు. మిరపకాయలగింజలు, ధనియాలు, మెంతులు, చింతపండు, ఇంగువ మొదలగునవి జిగురు జిగురుగా నుండు మట్టితోగూడి మిళితమై యీ చిట్టటకబల్ల నంటి యుండును. ఇప్పుడిప్పుడు గదుల పెట్టెలుగలవు. వానిలో నొక్కొక్క ఆరలోని సామానులమీద గొద్దింకలను, చిమ్మెటలును, పెంకి పురుగులును ఆడుకొనుచుండును. చిన్న పిల్లలను బూచి బూచి అని జడిపింపవలెనన్న నీగదుల పెట్టెను వారిముందర పెట్టి దాని మూత తటాలున తీసిన చాలును. వా రడిలి పోవుదురు. చిట్టటబల్లకు ఎదురు ప్రక్కన నీళ్ల బిందెలు పెట్టికొనుతిన్నె. ఇప్పుడిప్పుడు గచ్చు చేసిన అరుగులు కొన్ని ఇండ్లలోగలవు. కాని సామాన్యముగా నీళ్లబిందెల క్రిందనుండు నేల రెండు మూడడుగుల లోతువరకు బాగుగ నాని బందబందగానుండి చితచితలాడుచుండును. చెదలకును, తెల్లపురుగులకును, ఎఱ్ఱచీమలకును ఈ చల్లనినేల నివాసము.