పుట:AntuVyadhulu.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వంట ఇల్లు

15

చెంబులు, తప్పెలలు, నాజూకు తప్పిన సందుగ పెట్టెలు, కలందానులు, అడ కత్తెరలు, ఇత్తడి చిక్కంటెలు, బల్లులు, గొద్దింకలు, తేళ్లు ఇవి అవి అననేల ఒక్కొకపుడు పాములు గూడ ఆ బోషాణములో చేరియుండును. బోషాణము చాటున నుండు ఎలుకపెంటలను మరవకూడదు. ఇంక మంచముక్రింద క్రిక్కిరిసిన సామానులను, గంపలు, చాపలు, బుట్టలు, కాళ్లూడి పోయిన పీటలను, పీకిదానులనుగూర్చి మేము వ్రాయ నక్కర లేదు.

వంట ఇల్లు

పడకగదిలోనుండి వంటయింటిలోనికి పోవుదము. ఒక ప్రక్కను చద్ది అన్నములగూడు; ఈ గూటిలోనికి పిల్లులు కుక్కలు దూరకుండ చిన్నతలుపు; ఈ తలుపును తీసినతోడనే ఒకవిధమైన వాసన ముఖముమీదికి కొట్టును. ఈ గూటిలో చారు పులుసు మొదలగునవి అప్పుడప్పుడొలుకు చుండును. బాగుగ వెదకిన ఈ గూటిలో పదిదినములనాటి మెతుకులును, కూరముక్కలను, మూలలయందు క్రుళ్లు చుండునవి, ఒకటి రెండయినను కనబడక మానవు. ఈగూడును ఎన్నడును కడుగరు. బ్రాహ్మణుల యిల్లయినయెడల భోజనము చేయుస్థలము, పంక్తి పంక్తికిని ఆవుపేడ నీళ్లతో శుద్ధిచేయుట చేత నిరంతరము ఈగలు ముసురుచుండును. వానకాలములో బొత్తిగా ఆరుటకు వీలులేక కాలు జారుచుండుట వింతకాదు.