Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

తలఁకక గగనము దన్నినపాదము! బలరిపు గాచిన పాదము ||బ్రహ్మ|| 1

కామిని పాపము గడిగిన పాదము! పాము తల నిడిన పాదము! ప్రేమపు శ్రీసతి పిసికెటిపాదము! పామిడి తురగపు బాదము ||బ్రహ్మ|| 2

పరమ యోగులగుఁ బరిపరివిధముల! పరమొసఁగెడి నీపాదము! తిరువేంకటగిరి తిరమనిచూపిన! పరమపదము నీపాదము ||బ్రహ్మ|| 3 అన్న అధ్యా, 31 ఱేకు.

కురువనంబి

తలయేరుగుండు దాటిన తర్వాత కుమ్మరమండప మని యొుక స్థలము గలదు. అది నేఁడు చెడినది. అక్కడిజాళ్ళు మెట్లకుఁ బ్రక్కగోడ ఱాళ్లుగా మాఱినవి. ఆ జాళ్ళ మీఁదఁ గురువనంబి కథాశిల్పము లున్నవి.

ఒక కుమ్మరి స్వామికిఁ బ్రతిదినము వంటకుండలుచేసి యర్పించుచు దానియాయతిచే జీవించుచుండెను. అనుదినము నెడతెగక యూవని యుండుటచే నాతనికి స్వామిదర్శనము తఱచుగా లభింపదయ్యెను. కొయ్యతో శ్రీనివాసమూర్తిని గల్పించుకొని యాతఁడు కుండలు చేయఁగా మిగిలిన మట్టితోఁ బుష్పములు గావించి యామూర్తి నర్చించు చుండెను. తొండమానుఁడనురాజు ప్రతిదినము స్వామికి బంగారుపూలతో దొలిపూజ జరుపుచుండెను. ఒకనాఁడు రాజు స్వామి పాదములపై నర్పించిన బంగరపూ లోకప్రక్కకు జాఱి యుండుటయు, మట్టిపూవులు శ్రీపాదములపై నుండుటయుఁ గానవచ్చెను. రాజుచూచి విచారింపఁగా కుమ్మరి తనయున్నచోట నర్పించుచుండినపూవు లవి యగుట తెలియవచ్చెను. రాజు కుమ్మరిని దర్శించి, తన కట్టియోగ్యత నర్థించెను. స్వామి కుమ్మరికిని అహంకృతి తొలగించుకొన్న రాజునకును సాన్నిధ్యమొసగెను. ఈ కథ వెంకటాచలమాహాత్మ్యమునను గలదు.