పుట:Andrulasangikach025988mbp.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సూచనలు వాటి ప్రాచీనతను తెలుపును.

సుంకము తీసుకొను అధికారులను సుంకరులు అనుచుండిరి. సుంకమును సంస్కృతమున శుల్కమందురు. వాటిని తీసుకొనుటకు ఘట్టములు (నాకాలు) ఏర్పాటు చేసియుండిరి. 'ఘట్టకుటీ ప్రఖాతన్యాయము' అని గీర్వాణ మందందురు. ఒకడు మునిమాపే బండిసరకుతో బయలుదేరి అడ్డబాటల బడి సుంకముఘాటును తప్పించుకొనదలచి చీకటిలో బాటతప్పి తిరిగితిరిగి భల్లున తెల్లవారువరకు నేరుగా సుంకమునాకా వద్దనే తేలెనట! సుంకరివారు చాలా దుర్మార్గులని భద్రభూపాలుడే అన్నాడు.

        "జూదముకంటె వాదమును
         సుంకరికంటెను పాపకర్మమున్"

లేదు. అని యన్నాడు.[1]

జనులు వల్లువములు (రూకలసంచులను) నడుమున కట్టుకొను చుండిరి. అవి కండ్లువడ అల్లినజాలె సంచులు, అట్టి జాలె సంచులను పల్లెలలో నేటికిని వాడుకొనుచున్నారు.

ఓరుగంటినగరమున నాగరికుల కవసరమగు మంచిచెడ్డ సాధనములన్నియు నుండెను. మేదరవాం డ్రుండిరి. కుట్రపువా రుండిరి. వారు మోహరివాడలో నుండుటచే ప్రత్యేకముగా సైనికులకే యేర్పాటై యుండిరేమో! అయినను భోగమువారు రవికలను కొలతలిచ్చి అప్పుడప్పుడు కుట్టించుకొను చుండిరి. జూదములాడుట సామాన్యదృశ్యము. ఒంటిపై దుప్పట్లుకూడ అమ్ముకొని జూదమాడుచుండిరి.

"పచ్చడం బమ్ముకొన్నారు పణములకును"

---క్రీడాభిరామము.

మేషయుద్ధాలను, కోళ్ల పందెములను ఆడుచుండిరి. పొట్లేండ్ల యుద్ధమును వెంకటనాథుడు తన పంచతంత్రమందు వర్ణించెను. (1-232). పాములాటను చూపించువారుండిరి. గానుగ వృత్తిచే జీవించు గాండ్లవారుండిరి. డక్కి,

  1. నీతిశాస్త్రముక్తావళి, పద్య1 151.