పుట:Andrulasangikach025988mbp.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూటకూలి ముచ్చటయందే వచ్చినది, పూటకూలి 1000 ఏండ్లనుండి యున్నట్లే, మన ప్రాచీనులు అన్నము నమ్ముట నీచమనిరి. కావున ఇది ఆంధ్రములో ఈ 1000 ఏండ్లలోనే ప్రబలియుండును. నగరాలుండుచోట పూటకూళ్లు తప్పక ఏర్పడును. ఆంధ్రనగరమున బరగిన ఓరుగల్లు ఒక మహానగరమై యుండినందున పూటకూళ్ళుకూడా అందు నెలకొనెను. దానిని క్రీడాభిరామకర్త యిట్లు వర్ణించెను.

       "సంధివిగ్రహయానాది సంఘటనల
        ఖందకీజారులకు రాయబారి యగుచు
        పట్టణంబున నిత్యంబు పగలురేయి
        పూటకూటింట వర్తించు పుష్పశరుడు"

ఒక్కరూక యిచ్చిన యేమేమి లభిస్తుండెనో యిటు తెలిపినాడు.

       "కప్పురభోగి వంటకము
        కమ్మని గోధుమపిండి వంటయున్
        గుప్పెడు పంచదారయును
        క్రొత్తగ కాచిన యాలనే, పెసర్
        పప్పును, గొమ్మునల్లనటి
        పండ్లును, నాలుగునైదు నంజులున్
        లప్పలతోడ క్రొంబెరుగు
        లక్ష్మణవజ్ణలయింట రూకకున్."

ఇంకేమి కావలెను? ఇది ఉత్తమాహారము (Balanced diet), కప్పుర భోగి అనునవి సన్నబియ్యపుజాతి. ఈనాడు మహారాజు భోగాలు అన్నట్టివి.

ప్రతాపరుద్రుని యుంపుడుకత్తె చరితను "ఆడుదురు నాటకంబుగ నవనిలోన" అన్నాడు క్రీడాభిరామకర్త, పాల్కురికి కూడా 'పటు నాటకంబుల నటియించువారు' అనెను.

ఆ నాటకా లెట్టివి ?

గీర్వాణ నాటకపద్ధతి వేమో కావు, మరి అవి యక్షగానములై యుండును.