"వెట్టి కేగెడుతట్ట బట్టి యెత్తుడు"
అని పాల్కురికి వర్ణించినాడు[1].
"దేవతల వెట్టికి బట్టినవాడు"
అని నాచన సోమన యనెను[2].
శూద్రజనులు విశేషముగా చల్లడములు (చల్లాడము, చిల్లడము) కట్టు చుండిరి.[3] ఒడిసెలను పిట్టలుకాయుటకు, యుద్ధములో వాడుటకును ఉపయోగించిరి[4] గ్రాసగాండ్లకు జొన్నల జీతమిచ్చిరి. ఇప్పటికిని ఆ యాచారము కలదు. "జొన్నలు గొన్న ఋణంబు నీగుదున్" అని నన్నెచోడుడు వ్రాసెను.[5] జనులు అప్పుడప్పుడు పౌరాణికులవలన భాగవత భారతకథలను వినుచుండిరి.
"విబుద విప్రుల బిల్వగ బంచి
వినుము భాగవతంబు విజ్ఞాన మొదవ
భారతరణకథ పాటించి వినుము."
అని బాలచంద్రునికి తల్లి చెప్పెను. ఆ కాలమున బ్రాహ్మణులే పౌరాణికులై యుండిరేమో! అయితే క్రీ.శ. 1132 వరకు భారతములో మొదటి మూడు పర్వాలే తెనుగై యుండెను. భాగవతము తెనుగు కాలేదు. కావున తేలిన దేమన, ప్రజలు సంస్కృత భారత భాగవత పురాణాలను విని అర్థముచెప్పించుకొంటూ వుండిరి.
వట్టము, వడ్డి అను అప్పులవ్యాపారము సాగుచుండెను. "వట్టము లంచ ముంకువయు, వైద్యము, వేశ్యయు, బూటకూలియున్, చేపట్టుననబ్బు"[6]