పుట:Andrulasangikach025988mbp.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బొంగరాల ఆట పిల్లల ఆటలలో చాల ముఖ్యమైనదిగా నుండెను. బాలచంద్రుని బొంగరాల ఆటను చాల విరివిగా వర్ణించినారు. పన్నార్లు అనునవి బాలిక లాడుకొను గురుగులు అని శబ్దరత్నాకరమందు వ్రాసినారు. అదెట్టి యాటనో తెలియదు. "పన్నార్లమాటున" అని పాల్కురికి వ్రాసెను.[1]

కోడిపందెము హిందువుల ఆటలలో ముఖ్యమైనది. అది చాల ప్రాచీనమైనది. పల్నాటియుద్ధమునకు "కోడిపోరు" ఒక ముఖ్యకారణ మన్నారుకదా! నాయకురాలికోళ్ళు, బ్రహ్మనాయనికోళ్ళను గెలుచుట, పందెములో నోడిన బ్రహ్మనాయుడు రాజ్యమువదలి ఏడేండ్లు పరదేశ మందుండుట, అటుపై పల్నాటి యుద్ధము జరుగుట సుప్రసిద్ధమగు చరిత్రయే.

        "కృకనాకు స్తామ్రచూడ:
         కుక్కుట శ్చరణాయుధ:"

అని అమరుడు వ్రాసెను. కాళ్ళతో తన్ను కొని యుద్ధము చేయునవికాన చరణాయుదులని వాటికి పేరు పెట్టెను. మనపూర్వికులు వాటి కుడికాళ్ళకు జేనెడు కత్తులను గట్టి యుద్ధము చేయిస్తూ యుండిరి. ఆ విధానము అవిచ్చిన్నముగా మన కాలమువరకును పట్టుకొని వచ్చినవి. కోడిపందెమునకై యొక్క శాస్త్రమే మనతెనుగువారు వ్రాసి పెట్టుకొన్నారు. చలికాలములోను, సంక్రాంతి పండుగ కాలములోను కోళ్ళపందెములకై కోళ్ళను చంకబెట్టుకొని కుక్కుట శాస్త్రమును గుండురుమాళ్ళలో దోపి తమ శాస్త్రప్రకారముగా కుక్కుటసజీవ ద్యూతనిపుణులు పందెము కట్టుతూ యుండెడివారు. ముప్పై యేండ్లనుండి కోడిపందెము నిషేధింపబడినందున అ శాస్త్రాలు మూలబడి మాయమవుతున్నవి.

దండికవి క్రీ.శ. 750 ప్రాంతమువాడు. అతడుతన దశకుమార చరిత్రములో కోడిపందెమును వర్ణించినాడు. అందు నారికేళజాతి ఒక జాతికోడిని గెలిచినని వ్రాసెను. అభినవదండియగు కేతన తెనుగులో దశకుమార చరిత్రమును వ్రాసినప్పుడు కోడిపందెమును చాలా విస్తరించి వ్రాయుటచేతను తెనుగు దేశమం దా పందె మెంత ప్రాముఖ్యము పొందియుండినో యూహింప వచ్చును.

  1. పండితారాధ్యచరిత్ర, మొదటిభాగము. పుట 130.