Jump to content

పుట:Andrulasangikach025988mbp.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       "ఎదిరికోడి మున్నెవసి యారెడు మెడ
        నెనగాడ నురువడి వ్రేసి వ్రేసి......."
       "గెలిచె నామాట దగ నారికేళజాతి"[1]

క్రీడాభిరామములో కోళ్ళయుద్ధమును చాలావిపులముగా, హాస్యజనకముగా, మనోరంజకముగా కవి వర్ణించినాడు. దాని నుదాహరించుట విపుల హేతువగునని సూచనమాత్రముతో తృప్తిపడనైనది.

జనుల వినోదాలలో గంగిరెద్దుల దొకటియై యుండెను.[2] ఇవి కాకతీయుల కాలమందలి మన పూర్వికుల కతిపయవినోద విశేషములు.

స్త్రీల అలంకరణములు

పూర్వము తెనుగు స్త్రీల కేమి సౌందర్య మనిపించెనో యేమో! ముంగర, ముక్కర, నెత్తిబిళ్ళలు, దండకడెములు, వంకీలు, మున్నగునవి యెక్కువగా దరిస్తూ వుండిరి. జోమాలదండను వేసుకొనుచుండిరి.[3] ఇప్పుడు స్త్రీలు (యువకులుకూడా) మైపూతలకై చాల వ్యయము చేస్తున్నారు. స్నో, పౌడర్, నూనెలు, గోరురంగులు, వాటి యంగాంగములగు అద్దము, దువ్వెన, బ్రష్షు, మొదలయినవి వాడుదురు. ఆ కాలపు స్త్రీలకు పసుపే ప్రధానము. అది మెరుగు నిచ్చి వెండ్రుకలను పోగొట్టి క్రిమి సంహారియై పని యిచ్చెడిది. ఆనాటి స్త్రీలు గోళ్ళకు గోరంట ఆకు దంచి కట్టి రంగు వేసుకొనుచుండిరి.

వారు పెదవులకు యావకరసాన్ని (లక్కరంగును) పూసుకొనుచుండిరి.

       "దరహాసరుచివరాధరకాంతి మాన్చునన్
        వడవున కెమ్మోని వన్ను పూన్చి"

(నన్నెచోడ-కుమారసంభవం)

  1. దశకుమారచరిత్ర.
  2. "గంగిరెద్దులవాడు కావర మణచి ముకుదాడు పొడిచిన పోతెద్దులట్లు" పల్నాటి, పు. 20.
  3. పండితారాధ్య, భాగం 139. "గోరుంట యెర్రలయిన వాలారు నఘంకురములు" అని క్రీడాభిరామ మందును వర్ణింతము.