పుట:Andrulasangikach025988mbp.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆకులు, కూరగాయలు, టెంకాయలు, మాదీఫలములు, మామిడిపండ్లు, చింతపండు, నువ్వులు, గొధుమలు, పెసలు, వడ్లు, జొన్నలు, నూనె, నెయ్యి, ఉప్పు, బెల్లము, ఆవాలు, మిరియాలు, తగరము, సీసము, రాగి, చందనము, కస్తూరి, మంజిష్ఠ, దంతము, పట్టు, పసుపు, ఉల్లి, అల్లము అమ్ముచుండిరి.

ఒకతె "ఓరుగంటి పురంబులో ఓరగ్రంత బెద్దయెలుంగున నమ్మె సంపెంగనూనె"[1] ఆ కాలములో మోటుపల్లియు, మచిలీపట్నమున్ను ప్రసిద్ధమగు ఓడరేవులు. అచ్చటికి పర్షియా, అరేబియా, చీనాదేశముల సరకులు వచ్చి దిగుచుండును. మోటుపల్లిరేవు తీరములోకూడా సుంకములు తెలుపు శాసనమును స్థాపించిరి. దానినిబట్టి ఆంధ్ర దేశములోనికి కర్పూర, చందనాది సుగంధవస్తువులును, దంతములు, ముత్తెములు, పట్టుబట్టలు విశేషముగా దిగుమతి యగుచుండెనని తెలియును. ఆ శాసనము గణపతి దేవునిచే వేయించబడెను.

గ్రామాలలోకూడా సుంకములను తీసుకొనుచుండిరి. పుల్లరి, అంగటి ముద్ర సుంకము మున్నగునవి తీసుకొనిరి.

ప్రజల వినోదము

నన్నయకు పూర్వమం దుండిన జనుల భాషలోను, కవితారీతులలోను, నన్నయ మార్పుచేసి తెనుగును విశేషముగా సంస్కృతమునకు లంకెపెట్టెను. ఆతనికి పూర్వము మధ్యాక్కరలు, ద్విపద, త్రిపద, షట్పద, రగడ వంటివి రచించి, జనులు గానము చేసినట్లున్నది. నన్నయ తర్వాత 200 ఏండ్లకే ద్విపదకు గౌరవము తగ్గినట్లయ్యెను. అందుచేత పాల్కురికి సోమనాథుడు ద్విపద ప్రాశస్త్యమును గూర్చి ప్రత్యేకముగా వాదించెను.

        ఉరుతర పద్య గద్యోక్తుల కంటె
        సరసమై పరగిన జానుదెనుంగు
        చర్చింపగా సర్వసామాన్య మగుట
        కూర్చెద ద్విపదలు కోర్కి దైవార.[2]

  1. క్రీడాభిరామము 7.
  2. బసవ పురాణము పు 5.