మరియు ఆతని కాలములోను అంతకు పూర్వ మందును తుమ్మెద పదములు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు, వాలేశు పదాలు, వెన్నెల పదాలు మున్నగున వుండెను.[1] ఈ పదా లన్నియు క్రమమగా నశించుటచేత జనసామాన్యములో విద్యా ప్రచారమున కవకాశములు తక్కువయ్యెను. జనులలో పాటలకే ప్రాముఖ్య ముండెను. వారు బహువిధములగు పాటలు పాడు కొనుచుండిరి.
"మేటియై చను భక్తకూటువలందు
పాటలుగా గట్టి పాడెడువారు
ప్రస్తుతోక్తుల గద్య పద్య కావ్యముల
విస్తారముగ జేసి వినుతించువారు
అటుగాక సాంగ భాషాంగ క్రియాంగ
పటునాటకంబుల నటియించువారు
మునుమాడి వీరు వారననేల కూడి
కనుగొన రోళ్ళ రోకళ్ళ బాడెదరు"[2]
భక్తకూటువలు (భజన మండలుల వంటివి) ఉండుట, అందు పాటలు కట్టి పాడుకొనుట, రోకటి పాటలు పాడుటయు, అవి నేటికిని పామరజనులలో నిలిచి యుండుటయు గమనింపదగినవి.
"...రోకటిపాట లట్ల వేదములు
వనుగొన మా శివభక్తుల యిండ్ల"[3]
అని కవి రోకటిపాటల ప్రాధాన్యము నొత్తి చూపినాడు.
నాచన సోముడు జాజరపాటను గూర్చి ఇటుల ప్రస్తావించెను.
" వీణాగానము వెన్నెలతేట
రాణ మీరగా రమణుల పాట
ప్రాణమైన పిన బ్రాహ్మణ వీట
జాణలు మెత్తురు జాజఱపాట"