పుట:Andrulasangikach025988mbp.pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లును, వారి సామంతులును, ధనిక వ్యాపారులును అనేక తటాకములను నిర్మించి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడిరి. గణపతి సేనాని యగు రుద్రుడు పాఖాల చెరువు కట్టించెను. కాటసముద్రను కాట చమూపతియు, చౌడ సముద్రమును చౌడచమూపతియును, సబ్బిసముద్రమును గౌర సముద్రమును కోమటి చెఱువు అను వాటిని నామిరెడ్డియు, ఎఱుక సముద్రమును ఎఱ్ఱక్క సానమ్మయు కట్టించిరి. ఇవికాక చింతల సముద్రము, నామా సముద్రము, విశ్వనాథ సముద్రమును కట్టించిరి. [1] ఈ చెరువుల క్రింద చెరకు తోటలు, ఆకు తోటలు పండించిరి.[2]

జగత్కేసరి సముద్ర మను మరొక తటాక మీ కాలమందే నిర్మింప బడెను. అంబదేవుడు అను కాయస్థుడు భూమినికొలిపించి పన్నుల నేర్పాటును చేయించెను. భూమిని కొలుచుటకు "పెనుంబాక మాన దండము" అనునది సుప్రసిద్ధమై యుండెను.[3]

కాకతి ప్రభువులు బంగారు వెండి నాణెములను ప్రచారము చేసిరి. ఆ నాణెముల విలువ యిప్పటి నాణెములతో ఎంతో సరిగా జెప్పజాలము. ఏకమ్రనాథుడు సువర్ణ నిష్కములను మాట పలుమారు వ్రాసెను. ప్రోలరాజు కాలములో తూకము లిట్లుండెను.

120 గురిగింజలు= 1 తులము;
120 తులములు= 1 వీసె;
120 వీసెలు= 1 బారువా,

వరహాలు కూడా అప్పుడే యేర్పడెను. వరాహలాంచనమును బట్టి వరహా యేర్పడెను. ఒక కర్ణాట వేశ్య తన రేటు 'శాటిహాటక నిష్కము' అని చెప్పెను.[4] (శాటి అనగా 'సాడీ'=చీర.) మరొక జారిణి రెండు సొన్నాటంకములు కోరెను. వరహాల సూచన నాగులపాటి శాసనమందు కలదు. భూములను కుదువబెట్టుటలో రూకలతో వ్యవహారము జరుగుచుండెను.

  1. నాగులపాటి శాసనము.
  2. నాగులపాటి శాసనము.
  3. మల్కాపుర శాసనము (తెలంగాణా శాసన గ్రంథము)
  4. పండితారాధ్య చరిత్ర. 2 వ భాగము. పుట 303.