పుట:Andrulasangikach025988mbp.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శైవ, వైష్ణవ భేదము లెట్లున్నను వా రిరువురును కులనిర్మూలనమునకై కృషిచేసిరి. లింగము కట్టినవారందరి దొకే లింగవంత కుల మనిరి. సమాశ్రియణమను ముద్రలు వేయించుకొని ఊర్ధ్వపుండ్రదారు లైనవారందరును ఒకే కులమువా రనిరి.

పల్నాటి వీరచరిత్రములో బ్రహ్మనాయడు బ్రాహ్మణాది చండాల పర్యంతము నానాకుల స్త్రీలను పెండ్లాడెననియు, తనకు ముఖ్యుడైన కన్నమనీడు బ్రహ్మనాయుని తండ్రిగా చెప్పుకొనుటయు, యుద్ధరంగమున మాల, మాదిగ, వెలమ, కమ్మరి, వడ్ల, కుమ్మరి మున్నగు కులాల వారందరును వైష్ణవ సాంప్రదాయమువారై ఏకపంక్తిలో 'చాపకూడు' కుడుచుటయు ముఖ్యముగా గమనింపదగినది. వెలమలు సంఘసంస్కారు లగుట, రెడ్లు పూర్వాచార పరులగుట కానవస్తున్నది. ఈ చాపకూడు కూడా పల్నాటియుద్ధాని కొక ముఖ్యకారణ మయ్యెను.[1]

వెలమలచర్చ వచ్చినందున ఇచటనే వారినిగూర్చి సూత్రప్రాయముగనే నాలుగు మాటలలో తెలుపుదుము. వెలమ లెవ్వరన్నది నేటికిని తేలినది కాదు. రెడ్లకు వెలమలకు ఓరుగంటిపై రుద్రమదేవికాలములో తురకల దండయాత్రా కాలములో స్పర్థలు ప్రారంభమై నిత్యాభివృద్ధి కాంచి, ఉభయుల రాజ్యాల నాశనమునకు దారితీసెను. రుద్రమదేవి వెలమలకు ఒక విశిష్టతను రెడ్లకిచ్చిన విశిష్టతనేమో కల్పించెను. వెలమలు వీరవైష్ణవు లైనట్లును, రెడ్లు వీరశైవులుగా నుండినట్లును కానవస్తున్నది. కొండవీటి రెడ్డిరాజులను పరమ శైవాచార పరాయణులుగా శ్రీనాథుడు వర్ణించెను.

"ఇచ్చోట బోరిరి యిలపణంబుగ గొల్లసవతి తల్లుల బిడ్డ లవనిపతులు" అన్న క్రీడాభిరామ వాక్యమున కేమర్థము?

  1. "ఆరువల్లి నాయురాలి దుర్మంత్రంబు
    కోడిపోరు, చాపకూటి కుడుపు,
    ప్రథమకారణములు, పల్నాటి యేకాంగ
    వీరపురుష సంహారమునకు" --- క్రీడాభిరామము</poem>