పుట:Andrulasangikach025988mbp.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అదేసమయములో తెనుగుసీమలోనికి వైష్ణవము వీరావేశముతో వీర శైవమున కెదురొడ్డి వీరవైష్ణవముగా విజృంభింప నారంభించెను. వైష్ణవము సైవము కొత్తగా ఏర్పడినవికావు. అవి అరవదేశ మందు ప్రాచీనము నుండియే స్థిరపడియుండెను. వైష్ణవముకన్న శైవమే అరవదేశమందు ప్రాచీనతరమైనట్టిది. ఆ రెండు మతాలు తెనుగుదేశములోనికి వచ్చెను. ఉభయమత ప్రబోధకులును పరస్పరస్పర్ధతో శూద్రాది జనసామాన్యమునకు మూడభక్తిని ఒంటబట్టించి వారు మరల జారిపోకుండుటకై శివలింగాలు కట్టి లేక వైష్ణవముద్రలువేసి నామాలు పెట్టించిరి. గోన బుద్ధారెడ్డికూడ రామాయణమును ద్విపదలో వ్రాయుట, వైష్ణవ ప్రచారమునకై చేసిన శైవానుకరణమే. తర్వాతికాలములో 'చిన్నన్న ద్విపద కెరుగును' అను విఖ్యాతిగాంచిన తిరువేంగళనాథుడు కేవలము శివనిరసనముతో విష్ణుభక్తిని ప్రచారము చేయుటకై 'పరమయోగి విలాస' మను ద్విపద పురాణమును వ్రాసెను.

జైనులు రంగమునుండి దిగజారిపోయిన తర్వాత మతోన్మాద గదా యుద్ధమునకు వీరశైవ వీరవైష్ణవులే మిగిలిరి. వీరు పరస్పరము తిట్టుకొన్నతిట్లే ఒక చేటభారతమగును. వీరు గుళ్లలోని విగ్రహాలనుగూడ శక్తికలిగినప్పుడు మార్చిరి. సుప్రసిద్ధమగు తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహము మొదట వీరభద్ర విగ్రహమనియు, దానిని వైష్ణవ విగ్రహముగా చేసిరనియు కాకతీయుల కాలపు వాడగు శ్రీపతి పండితులు తమ శ్రీకరభాష్యములో తెలిపినారు. [1] ఈ బలవత్పరివర్తనము చేసినవారు శ్రీమద్రామానుజాచార్యులవారని శ్రీపతి పండితులు తెలిపినారు.

ప్రాణాంతకమైనను సరే, జైనాలయములోనికి పోరాదన్నట్లుగా శైవ వైష్ణవులు ఒకరినొకరిని చండాలురనుగా, అసభ్యముగా దూషించుకొనిరి. మా దేవు డెక్కువ, మా దేవుడే యెక్కువని, నిరూపించుటకు కథలను పురాణములను సృష్టించిరి. ఈ జైన, శైవ, వైష్ణవ ద్వేషాలే కాకతీయాంధ్రరాజ్యాల పతనమున కొక కారణమయ్యెను.

  1. "నను వేంకటేశ్వర విఠ్జలేశ్వరస్థానే విష్ణోరీశ్వర ఆబ్దశ్రవణాత్ ...... వేంకటేశ్వరస్యాభాస విష్ణుత్వం, తదంగే నాగభూషణాది ధర్మణాం ద్యోతనాత్, మూల విగ్రహే శంఖచక్రాది లాంఛనానా మదర్శనాత్ ... కించ తత్పాణ్యధో దేశే శివలింగ దర్శనాదీశ్వరశబ్దో వ్యవహ్రియతే."