పుట:Andrulasangikach025988mbp.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెలమలు వెలమలేకదా! అందులోనూ జ్ఞాతులేకదా పల్నాటియుద్ధమును చేసిరి! వారు "గొల్లసవతితల్లుల బిడ్డలు" అని కవి యేల వర్ణించెను? నాకు స్ఫురించున దేమన, వెలమలు తెనుగు దేశమువారు కారు. ఆ లెక్కకు రెడ్లును అంతే! ఒకరు దక్షిణమునుండి, రెండవవారు ఉత్తరమునుండి వచ్చినారని తలంతును. రాష్ట్రకూటులు రెడ్లయిరి. దక్షిణ తమిళ దేశమునుండి తెనుగుసీమకు క్రీ.శ.1100 ప్రాంతములో వచ్చి కాకతీయుల సేనలో చేరిన 'వెల్లాల' అను జాతివారే వెలమలై యుందురు. వెల్లాలవారే వెలమలని వెల్లాలజాతిని గూర్చి చర్చించుచు థర్‌స్టను వ్రాసెను.[1] క్రొత్తగా వచ్చినందున వారిని రెడ్లు తక్కువగా చూచి, వారితో ద్వేషము సంపాదించుకొనిరి. శ్రీనాథుని కాలములో వెలమలు రెడ్లతో సమానులుగా పరిగణింపబడిరి. పల్నాటి వీరచరిత్రలో హైహయదాయాదులు పోరాడిరి.. వారు గొల్లవారై యుందురు. అందుచేత కవి యట్లు వర్ణించియుండును.

వైష్ణవులు కులభేదాలను ధ్వంసించిన దానికన్న హెచ్చుగా వీరశైవులు ధ్వంసము చేసినవారు. పైగా వారికి బ్రాహ్మణులతో నీ విషయమందు కలహించు పరిస్థితు లేర్పడెను. అందుచేత 'కోపం శేషేణ పూరయేత్‌' అన్న నీతి నాదారముగా కొని, కొన్నిమారులు వాదమును వదలుకొని 'త్వం శుంఠ స్త్వం శుంఠ:' అని తిట్టిపోసిరి.

       "శూలిభక్తుల కెత్తు కేలది త్రాటి
        మాలల కెత్తుట మరి తప్పు గాదె" [2]

       "అసమాక్షు గొలువని యగ్రజుండైన
        వసుధ మల.........." [3]

       "నా మాలకుక్కల నర్చింప దగునె" [4]

(ఇచ్చట వైష్ణవుల నుద్దేశించి తిట్టియుండును.)

  1. THURSTON - Castes and Tribes of South India.
  2. పాల్కురికి బసవపురాణము పు 19
  3. పాల్కురికి బసవపురాణము పు 217
  4. పాల్కురికి బసవపురాణము పు 237