పుట:Andrulasangikach025988mbp.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాథుని నాగేశ్వరరావుగారు ప్రారంభించిరి. అది నిత్యాభివృద్ధిగా ఆంధ్రుల సేవ నేటికిని చేయుచున్నది. 1920లో కృష్ణా పత్రిక ప్రారంభమయ్యెను. అదియు అవిచ్చిన్నముగా సాగుచున్నది.

ఇంగ్లీషువారి ప్రభావము భాషపై చాలాపడెను. అదేమి చిత్రమో తెనుగులో యక్షగానాలు తప్పితే వేరు నాటకాలు లేకుండెను. 1900 తర్వాత తెనుగు కవిత కూడా నీరసమై అప్పకవీయ శాసనబద్ధమై, అష్టాదశ వర్ణనలను వెర్రిమొర్రి రోకటి పాటలతో కూడినదై, జుగుప్సాకరమైనదయ్యెను. అందు శబ్దాడంబరమే యుండెను. వచన గ్రంథాలు ఏకామ్రనాథుని ప్రతాపచరిత్ర, కైఫీయత్తులు స్థానాపతి విజయనగర కైఫీయత్తు, తంజాపురీ కవుల వచన భారతాదులు మున్నగునవి కొన్ని తప్ప మరేవియు లేకుండెను. ఇంగ్లీషు చదివిన విద్వాంసులగు కందుకూరు వీరేశలింగముగారు, కొమర్రాజు లక్ష్మణరావుగారు, గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారు, కట్టమంచి రామలింగారెడ్డిగారు, గిడుగు రామమూర్తిగారు ఆంధ్రవాఙ్మయ పంఠను త్రిప్పివేసిరి. కట్టమంచివారి కవిత్వ తత్త్వవిచారము సనాతనపు కోటలో గుండుపడినట్లయ్యెను. అది పెద్దసంచలనము కలిగించెను. వారు 1900లో ముసలమ్మ మరణము అను ఉత్తమ బలిదాన కథను కొత్తరీతుల వ్రాసిరి. నిజముగా భావకవితకు ఆతడే మార్గదర్శి యనవలెను. వీరేశలింగ ప్రతిభ సర్వతోముఖవ్యాప్తి యయ్యెను. ఆతడు నాటకాలను, ఉత్తమ వచన గ్రంథాలను, నవలలను, హాస్యములను, కవుల చరిత్రను, స్వీయచరిత్రను, ఆంగ్లగీర్వాణ భాషలందలి యుత్తమ విషయాల అనుకరణములను రచించి అపారమగు సేవను చేసెను. కొమర్రాజు లక్ష్మణరావుగారి వ్యక్తిత్వము అసాధారణమైనట్టిది. అతని పట్టుదల, నిర్వహణము, విధానము, విషయ విజ్ఞానము, దానిని పిల్లలకును అర్థమగునట్లు రచించు నేర్పు, ఇతరు లందు కానవచ్చుట అరుదు. వారును గాడిచర్లవారును, హైద్రాబాదు రావిచెట్టు రంగారావుగారును (అనగా ఉత్తర సర్కారు, రాయలసీమ, తెలంగాణా ప్రతినిధులు.) కలిసి 1907లో విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను హైద్రాబాదులో స్థాపించిరి. ఈ గ్రంథమాల మొట్టమొదటి ప్రచురణము గాడిచర్లవారి అబ్రహాం లింకన్ చరిత్ర, దానికి కొమర్రాజు వారు పీఠిక వ్రాసిరి. అది చరిత్రాత్మకమైనది. మనలో లేనివి కావలసినవి బంగాలీలు మరాటీలు ముందుకు చాలా దూరము సాగిపోయిన విధానము వారు చాలా చక్కగా నిరూపించిరి. వారిట్లింకను వ్రాసిరి.