పుట:Andrulasangikach025988mbp.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సమీక్షా కాలములో జనుల ఆచార వ్యవహార విశ్వాసాలలో చాలా గొప్ప మార్పులు జరిగెను. ముసల్మానులు హింసామార్గములతో హిందువుల నాకర్షింప జాలినవారు కారు. హిందువులు ముసల్మానులను మరింత దూరముగా పరిహరించిన వారైరి. కాని ఇంగ్లీషువారు తమ నూతన భావాలతో హిందువులలోనే కాక ముసల్మానులలోను మార్పులను గావించిరి. కాని ముసల్మానులకన్న హెచ్చుగా హిందువులలో మార్పులు కలిగెను జుట్లు ఎగిరిపోతూ వచ్చెను. క్రాపులు బహుళమయ్యెను. బొందెల అంగీలు పోయెను. ఇంగ్లీషు అంగీతోపాటు కోట్లుకూడా వచ్చెను. టోపీలు విరివియయ్యెను. మొదట మొదట సముద్ర ప్రయాణము చేసిన వారిని బహిష్కరించిరి. తర్వాత ప్రాయశ్చిత్తముతో స్వీకరించిరి. తర్వాత ఏ యాటంకమున్నూ లేకపోయెను. వివిధ కులాల వారు కలిసి భుజించుటకు మొదలు పెట్టిరి. దీనికి హోటళ్లు దోహదమిచ్చెను. రైళ్ళు కూడా కులం కట్టుబాట్లను సడలించెను. అంతశ్శాఖా వివాహాలు, వితంతూద్వాహాలు ప్రబలెను. బాల్యవివాహాలు క్రమక్రమముగా తగ్గెను. ఇంగ్లీషు విద్యావంతులలో కొందరు ఇంగ్లీషు వేషములను సూటుబూటు కాలర్‌టై ధరించుట గౌరవ హేతువని భావించిరి.

ఇంగ్లీషు ప్రభుత్వము ప్రజల యొత్తిడియైనప్పుడే ప్రజాభీష్టము నెరవేర్చునట్టిది. సంఘ సంస్కారుల కోరికలను అప్పుడప్పుడు మన్నిస్తూ బాల్య వివాహములకు సరిహద్దులు మార్చుచూ వచ్చెను. మొదట 10 ఏండ్లలోపల బాలబాలికలకు వివాహము చేయరాదని శాసించిరి. 1890 ప్రాంతములో 12 ఏండ్ల లోపల బాల్యవివాహములు చేయరాదని శాసించిరి. 1850 ప్రాంతమందే పోస్టు (టప్పా) ఏర్పాటయ్యెను. 1853 లో తంతీలేర్పాటయ్యెను. క్రమక్రమముగా ఈ రెండు చాలా విరివిగా స్థాపింపబడెను. 1885లో రిప్పన్ గవర్నరు జనరల్ మునిసిపాలిటీలను స్థానిక స్వపరిపాలనమును ప్రారంభించెను.

టప్పా రైల్వేతంతీ సౌకర్యాలు వృద్ధియగుకొలది పత్రికలు కూడా వృద్ధియయ్యెను. కాని తెనుగు దేశములో పత్రికలవ్యాప్తి చాలా తక్కువగా నుండెను. 19 వ శతాబ్ది మధ్యకాలమందు బళ్ళారిలో 'శ్రీ యక్షిణి' అను వారపత్రిక ప్రారంభమయ్యెను. అదే తెనుగువారి మొట్టమొదటి పత్రిక. ఆంధ్ర పత్రిక వారపత్రికగా మహారాష్ట్రులుండు బొంబాయి నుండి వెలువడుట చాలా చిత్రము. కాని తర్వాత అది మద్రాసుకు మారెను. దిన పత్రికను కూడా కాశీ