పుట:Andrulasangikach025988mbp.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై యంశములు ఆనాటి ప్రజల యార్థికస్థితి తెనుగు దేశమం దెట్లుండెనో తెలుసుకొనుటకు సహాయపడును. 1876 లోను 1878 లోను బొంబాయి మద్రాసు రాష్ట్రాలలో అనగా దక్కనులో నంతటను మహాక్షామ మేర్పడెను. ఆ క్షామము దెబ్బ తెనుగుసీమపై విశేషముగా పడెను. నేటికిని 80 ఏండ్ల వృద్ధులా 'ధాత కరువు'ను గురించి ముచ్చటిస్తూ వుందురు. ఆ సంవత్సరమే "పగటి చుక్కలు రాలె"ను అని చెప్పుదురు. అనగా సంపూర్ణ గ్రహణము తెనుగు సీమలో అయ్యెనన్నమాట. అదే సంవత్సరము "ఎర్రగాలి" వీచెనందురు. ఆకాశమంతయు ఎర్రని ధూళితో నిండి దేశమంతటను నిండిపోయెనట. ధాత కరువులో జనులు లక్షల కొలదిగా తెనుగు సీమలో చనిపోయిరి. కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల తాలూకాలోని ఉయ్యాలవాడ అను గ్రామమందు బుడ్డా వెంగళరెడ్డి అను అపరకర్ణు డప్పుడు వెలసెను. అతడు తన సర్వస్వము కోల్పోయి అప్పులు చేసి చందాలెత్తి తన ధాన్యమునంతయు ఇచ్చివేసి వేనవేల క్షామబాధితులకు అన్నము పెట్టి రక్షించెను. నేటికిని కర్నూలు జిల్లావారా దాతను మరువలేదు.

బుడ్డా వెంగళరెడ్డి

ఉండేదే ఉయ్యాలవాడా

అని పాటలుకట్టి బిచ్చగాండ్లు పాడుతూ వుందురు. ఇట్టి దాత లింకెందరుండిరో ఆయా ప్రాంతాలవారు తెలిపితే బాగుండును. ధాత కరువులో దక్కనులో 50 లక్షలకన్న హెచ్చు మంది చచ్చిరని ఇంగ్లీషు చరిత్రకారులే వ్రాసినారు.