పుట:Andrulasangikach025988mbp.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలంగాణములో చాలా పరిశ్రమలుండెను. ఇంగ్లీషువారి వ్యాపారము మూలాన దేశమందలి అరాచకమువలన 1800-1850 ప్రాంతమున వాటి క్షీణదశ ప్రారంభమయ్యెను. వరంగల్ జంఖానాలు, తివాసీలు కాకతీయుల పతనమునాటి నుండి ప్రసిద్ధిగాంచినట్టివి. బిదరులో బిదరీ సామానులు బిదరుసుల్తానుల కాలమునుండి వృద్ధికివచ్చినవి. తెలంగాణము ప్రధానముగా నూలుబట్టలకు ప్రపంచ ప్రఖ్యాతి గన్నట్టిది. మార్కొపోలో రుద్రమదేవి కాలములోని సన్నని బట్టలను జూచి అవి సాలెపురుగుల దారలా అని భ్రమపడెను.

వరంగల్ తివాసీలను, జంఖాణాలను 1851లో ఇంగ్లండుకు ప్రదర్శనార్థ మంపిరి. ఇనుమును కరిగించి ఇనుపవస్తువులను చేయుచుండిరి. వరంగల్, కూన సముద్రము, దిందుర్తి, కొమరపల్లి, నిర్మల్, జగిత్యాల, అనంతగిరి, లింగంపల్లి, నిజామాబాదు మున్నగు స్థలములలో ఈ పనులు జరుగుచుండెను. నిర్మలవద్ద నుండు కూన సముద్రములో శ్రేష్ఠమైన ఉక్కును సిద్ధము చేస్తూవుండిరి. ఎల్గందల్ ఇబ్రహీం పట్టణము, కొనాపూరు, చింతలపేట మున్నగు స్థలాలలోను మంచి ఉక్కు సిద్ధమగుచుండెను. కూన సముద్రము ఉక్కువంటి దానిని పర్ష్యాలో చేయుటకు చాలా ప్రయత్నము చేసి విఫలులైరి. కత్తులను హైద్రాబాదు, గద్వాల, వనపర్తి, కొల్లాపురములలో 1890 వరకు కూడా విశేషముగా తయారు చేయుచుండిరి. 5 రూ. మొదలు 15 రూ. వరకు వాటి నమ్ముచుండిరి. బంగారు నీరు పోసిన కత్తులు ఖమ్మములోని జగదేవపూరులో తయారగుచుండెను. గద్వాలలో తుపాకీలు కూడా సిద్దము చేస్తుండిరి. రోహిలాలు పట్టే పెద్ద తుపాకీలను వనపర్తి, గద్వాల, నిర్మలలో చేసిరి. 20 రూ. నుండి 60 రూ. వర కమ్ముతూవుండిరి. నూలు, పట్టు కలిపి నేసిన మష్రూ అను బట్టలను హైద్రాబాదులో గద్వాలలో నేసిరి. టస్సర్ పట్టుబట్టలను వరంగల్, నారాయణపేట, మట్వాడా, హసన్‌పర్తి, కరీంనగరు జిల్లాలోని మాధాపురంలో నేయుచుండిరి. ఇందూరు (నిజామాబాదు), మెదకు, హైద్రాబాదులోను, మహబూబు నగరుకు 10 మైళ్ళ దూరములోనున్న కోయిల కొండలోను కాగితములు సిద్ధము చేయుచుండిరి. (బిల్గ్రామి సం. 1 పు. 395-425)

కడప జిల్లాలో దువ్వూరు అను గ్రామము కలదు. 'దువ్వూరు' మొదలుకొని ప్రతి గ్రామమందున్ను కొండకరమల వాండ్లు ఇనుప రాళ్ళతో ఇనుము చేయుచున్నారు. (కా. యా 6) గుంటూరు జిల్లాలో చేరిన వేటపాలె