పుట:Andrulasangikach025988mbp.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోటాతో, దానికొక చిన్న త్రాడుతో, ఒకకట్టు ధోవతితో నర్మాదాను ఒక మార్వాడీ దాటి హైద్రాబాదు చేరుకొనిన కొన్నేండ్లలోపల వాడు విపరీతపు వడ్డీ వ్యాపారమువల్ల ధనికుడై బండెడు బంగారు భర్తీతో మార్వాడు చేరుచుండెను (బి. 2-56). 'అరబ్బులు రాజారాం బక్షు అను పూర్వ మంత్రికి బాకీ లిచ్చిరి. అతడు బాకీలు చెల్లించకపోతే అరబ్బులు అతన్ని చాలా ఘోరముగా కష్టపెట్టగా తట్టుకొనలేక అతడు నిజాం దేవిడీలోనే దాగుకొనెను (బి.2-59). అరబ్బులు దౌర్జన్యాలు విపరీతమై పోయెను. వారు అప్పులిచ్చి హింసించి వసూలు చేసుకొనుచుండిరి. అప్పుల పోతులను తమ జమాదార్ల యిండ్లలో మూసివేసి కూడు నీళ్ళియ్యక కష్టపెట్టి బాకీలు వసూలు చేసుకొను చుండిరి. పఠానులు, అరబ్బులు జాగీర్దారుల కప్పులిచ్చి 80 లక్షల ఆదాయం కల జాగీర్లను తమ వశములో ఉంచుకొనిరి (బి. 2-118). 'పూర్వుం కోర్టులు లేకుండెను. కోమట్లకు వ్యాపారులకు అప్పులు రాకుంటే వారు రోహిలాలను అరబ్బులను పంపేవారు. వారు జంబియాలతో వసూలు చేసియో లేక సామానులను లాగుకొనియో వచ్చుచుండిరి. రోహిలాలు అరబ్బులు తమ సొంత అప్పులను ఇయ్యనివారిపై బండలు మోపి వాతలు వేయుచుండిరి. బాకీ పడినవాడు పారిపొయ్యేటట్లు కనబడితే వానిపై తమవారి నిద్దరి ముగ్గురిని కాపలా పెట్టి ఆ కావలి కూలీ కూడా వసూలు చేయుచుండిరి. తామిచ్చిన దాని కంటే చాలా యెక్కువ వసూలు చేస్తూ ఉండిరి. (బి. 2-163)

జనులు తమ పిల్లలను అమ్ముకొనుచుండిరి. అట్టి వ్యాపారాన్ని క్రీ.శ. 1856 లో నిషేధించిరి (బి. 2-19). హైద్రాబాదు రాజ్యములో క్రీ.శ. 1848లో సహగమనమును ఆపివేయించిరి. (బి. 2-58)

తెలంగాణములోని భూములన్నీ గుత్త కిచ్చుచుండిరి. గుత్తేదారులు రైతులవద్ద ధాన్యభాగము తీసికొని సర్కారుకు రూపాయలు చెల్లించు చుండిరి. భూములకు నిర్ణయమగు పన్నులు లేకుండెను. దేశముఖులు, దేశ పాండ్యాలు పన్ను వసూలుచేయు అధికారులు. భూమిపన్నే కాక మగ్గం పన్ను, కడప పన్ను, కలాలి, ధన్గర్‌పట్టి, దేడ్‌పట్టీ, కులాలపన్ను, పెండ్లిపన్ను, తోళ్ళపన్ను, హట్బాజరీ (కూరగాయలు). పీనిగులపట్టీ తోకపన్ను ఆదంపట్టీ (హిందూ పారిశ్రామికులపై పన్ను) మున్నగు 27 విధాల చిల్లర పన్నులను ప్రజల నుండి లాగుచుండిరి. (బి. 2-53)