పుట:Andrulasangikach025988mbp.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములో '1000 నేతగాండ్లుండిరి. తోపు శెల్లాలు, రుమాలా తానులు, చీరలు వగైరాలు నేసి అనేక దేశాలకు వుపయొగ మయ్యేటట్టు చేసి జీవించుచున్నారు.' (కా 355) బాలకొండలో (వేములవాడ వద్ద) 'మేనాసవారలు గంజీఫాచీట్లు ఇవి మొదలైనవి చేసి హైద్రాబాదుకు తీసుకొనిపోయి అమ్ముచున్నారు. ఈ యూరిలో జీనిగెలవాండ్లు అనేకులు ఉపపన్నులుగా నున్నారు.' (కా. 46) 'నిర్మల పంచపాత్రలు ఈ ప్రాంతములో బహు ప్రసిద్దిగా నున్నవి. నిండా కంచర యిండ్లున్నవి. (కా. 50)

అప్పటి జనుల ఆచార వ్యవహారాలు కొన్ని వీరాస్వామి యిట్లు తెలిపినాడు. 'హైదరాబాదులో గొప్పవారందరున్నూ పండుటాకులు (తమలపాకులు) వేసుకొనుచున్నారు. బాలకొండలో పండుటాకులు దొరకును. కడప మొదలుగా గోదావరీ తీరమువరకు (నిజామాబాదుకు ఉత్తరములో) అమ్మే వక్కలు ముడివక్కలు. ఈ దేశములో పేదలు నిండా తాంబూలము వేసుకోవడము లేదు. వక్కలు మాత్రము నములుతారు. శూద్రులచేతి హుక్కాలు ఇతరులు తాగుచున్నారు.' (కా. 48) హైదరాబాదులో పండ్లు దొరకును. కాని 'చెన్న పట్టణము కంటే మూడింతల వెల యివ్వవలసిది. కూరగాయలు ఆ ప్రకారమే ప్రియమైనా మహా రుచికరముగా నున్నవి. (కా. 34) 'కూరగాయల రుచికి హైదరాబాదు సమముగా యీవరకు నేనుచూచిన భూమిలో యేదిన్నీ కూడ చెప్పలేదు. (కా. 274)

ఆ కాలమున హిందూదేవాలయముల యొక్కయు, హిందూమతము యొక్కయు స్థితి శోచనీయముగా ఉండినది. హిందువులలో కులాల తత్త్వము వెరి రూపాల దాల్చెను. మద్రాసులోని కులకక్షలను గూర్చి యిట్లు కాశీ యాత్రలో తెలిపినాడు. 'అప్పట్లో అనేక తెగలు దేశముల నుంచి యక్కడికి వచ్చి చేరినందున యెడమచెయ్యికక్షి అని, కుడి చెయ్యి కక్షి అని రెందు పక్కలుగా యక్కడివాడు చీలి యింగ్లీషువారికి చాలాశ్రమను కలుగ జేసిరి.' (370) దేవాలయాల ఆదాయాన్ని ఇంగ్లీషు వారున్నూ నవాబులున్నూ తాము పాలించే ప్రదేశాలలో తీసుకొంటూ ఉండిరి.' వేంకటేశ్వరునికి ప్రార్థనలు చెల్లించే లోకుల వలన కుంఫిణీవారికి సాలుకు సుమారు లక్షరూపాయలు వచ్చుచున్నవి. కొండమీద యే ధర్మకార్యము చేసుకొనుటకున్ను సర్కారుకు రూకలియ్యవలెను.' (కా.4) 'అహోబిలములో ఉత్సవకాలమందు 400 వరహాలు హాశ్శీలు అగుచున్నవి.