పుట:Andrulasangikach025988mbp.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మద్రాసు సూబాలో ఉత్తర సర్కారులు కాక యితర జిల్లాలలో రయితువారీ పద్ధతిని ప్రవేశపెట్టిరి. దీనికి ముఖ్యకారకులు సర్ తామస్ మన్రోగారు ఆ కాలపు ఇంగ్లీషువారిలో అత డుత్తమోత్తము డనిపించుకొన్నాడు. అతడు మద్రాసు సూబాలో 24 ఏండ్లుండినాడు. తుది సంవత్సరాలలో రాయలసీమకై చాలా పాటుపడినారు. అతడు కలరా తగిలి కర్నూలు జిల్లాలోని పత్తికొండలో 1827 లో చనిపోయెను. అతన్ని రాయలసీమ ప్రజలు చాలా ప్రేమించిరి. పలువురు మన్రో అయ్య అని తమ పిల్లలకు పేరు పెట్టుకొనిరి. మన్రో సూచించిన పద్ధతియే యిప్పటి పట్టాదారు పద్ధతి. పూర్వము భూముల గుత్తేదారులుండిరి. ప్రభుత్వానికి రైతులతో సంబంధము లేకుండెను. ప్రభుత్వానికి నేరుగా రైతుల సంబంధ ముండునట్లు రైతులకు తమ భూములపై సంపూర్ణ క్రయ విక్రయాది స్వత్వము లుండునట్లును మన్రో రయిత్వారీ పద్ధతి నిర్ణయించెను. మన్రోకు ముందు కంపెనీవారు రైతుల పంటలో సగముకన్న హెచ్చుగా పన్నులుగా గ్రహించుచుండిరి. మన్రో దానిని తగ్గించెను.

తెనుగు జల్లాలలో రయిత్వారీ పద్దతి మనకంతగా తెలియదు. రొమేశదత్తు ఇట్లు ఒకటి రెండు తెనుగుజిల్లాల ముచ్చట తెలిపినాడు.

"నెల్లూరుజిల్లా కలెక్టర్ కోవూరును రయిత్వారీ విధాన పరీక్షకై నిర్ణయించెను. 1818లో అచట భూముల కొలిపించి బందోబస్తు చేయించెను. తరీ (మాగాణీ) భూములలో వరిఖండికి 20 రూపాయల ధర నిర్ణయించిరి. దాని ప్రకారము బందోబస్తు అయిన భూమి పంట విలువ 34374 రూపాయలు. దాని నుండి ఎప్పటివలెనే 'క లవసం నూటికి ఆరుంబావు ప్రకారము తీసివేసిరి. అనగా 2234 రూపాయలు తొలగించిరి. మిగిలిన 32139 రూపాయలు సర్కారున్నూ, రైతులున్నూ పంచుకొనవలసి యుండెను. రైతులకు 20 పాళ్ళలో 9 పాళ్ళు అనగా నూటికి 45 పాళ్ళు ఇచ్చిరి. ఆ లెక్కచొప్పున రైతులకు 14462 రూ. సర్కారుకు 17667 రూ. వచ్చెను. మెట్ట పొలాలలో (ఖుష్కీ)లో ఖండి 28 రూ.లు బజారుదర ప్రకారం లెక్కగట్టి పై విధముగా విభజింపగా సర్కారుకు 768 రూ. వచ్చెను. మొత్తముపై కోవూరు గ్రామము భూములనుండి ప్రభుత్వానికి 15600 రూ. పన్ను వచ్చునని తేల్చిరి. అనగా పంటలలో సగము ప్రభుత్వము తీసుకొనెను. Chapter IX P. 154.