పుట:Andrulasangikach025988mbp.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ఉత్తర సర్కారులను రాయలసీమ అను కర్నూలు, కడప, బళ్ళారి, అనంతపురము జిల్లాలను (Ceded districts) గుంటూరు జిల్లాయు, క్రీ.శ. 1800 లోపలనే ఇంగ్లీషువారికి వచ్చెను. తర్వాత 1857 వరకు భారత దేశ మంతయు వారి వశమగుటచే తెనుగు దేశ మంతయు వారి వశ మయ్యెనని వేరుగా చెప్పనవసరములేదు. తెనుగుదేశములో ఉత్తర సర్కారులకు విశిష్టత యుండెను. అందలి నాలుగు జిల్లాలలో (విశాఖపట్టణము, ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలలో) భూమి అంతయు జమీందారుల పాలెగారు తెగకు అప్పజెప్పబడి యుండెను. ఈ జమీందార్లు మొగల్ సుల్తానులకు కప్పము కట్టి ఇంచుమించు రాజులై వర్తించిరి. పెద్దాపురము జమీందారు మొగలాయి రాజ్యానికి 37000 పౌనులు (3 లక్షల 70 వేల రూపాయలు) కప్పము కట్టుచుండెను. ఈస్టిండియా కంపెనీవారు అతనివద్ద 5 లక్షల 60 వేల రూపాయీల కప్పములాగిరి. అదేవిధముగా ఇతర జమీందారుల పన్నులను హెచ్చించిరి. ఉత్తర సర్కారులలో 31 జమీందారీ లుండెను. అప్పటి కాలములో సర్కారు జిల్లాలను చికాకోలు, (శ్రికాకుళం) రాజమండ్రి, ఎల్లూరు, కొండపల్లి అని పేర్కొనిరి. అవి మొగల్ సుల్తానులనుండి 1765 లో ఇంగ్లీషువారు తీసుకొనిరి. కంపెనీవారు ఉత్తర సర్కారుల స్థితిగతుల నొక కమిటిచే విచారింప జేసిరి. వారు 1788 లో తమ నివేదికను సమర్పించుకొనిరి. దానినిబట్టి కొన్ని వివరాలు తెలియవచ్చెను. కొందరు జమీందారులు ఓడ్రరాజుల సంతతివారని తెలియ వచ్చెను. ఉత్తర సర్కారుల జమీందారులకు హవేలీలు అను సొంత భూములుండెను. ఈజమీందారీలలో సాముదాయిక వ్యవసాయ పద్దతి (Village Communities) ఉండెను. ప్రతి గ్రామానికి పన్నిద్ద రాయగాండ్లుండిరి. రెడ్డి, కరణము, తలారి, తోటి, నేరడి, పురోహితుడు, బడిపంతులు జోసి, వడ్ల, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, వైద్యుడు, బోగముది అందు చేరి యుండిరి. ఈ ప్రాచీన గ్రామ జీవనవిధానమును కంపెనీవారు నాశనము చేసిరి. ఉత్తర సర్కారులలో బెంగాలులో వలె 1802 లోను 1805 లోను శాశ్వత భూమి పన్ను విధానమును (పర్మనెంటు సెటల్మెంటు) ఏర్పాటుచేసిరి. ప్రజల పంటలో మూడింట రెండుపాళ్లు పన్నుగా నిర్ణయించిరి. హవేలీ భూములను జమీందారులకే వేలం వేసి యిచ్చివేసిరి.' (India under early British rule by Romesh Dutt, chapters VI&VII)