పుట:Andrulasangikach025988mbp.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భండారమును సైనిక వ్యయమునకు వెంటదీసుకొనిరి. గుఱ్ఱము దళముల సైన్యాగ్ర భాగమందు నడిపిరి. ధారలు (బాకాలు), చిందములు (శంఖములు) మ్రోయించిరి. ఏనుగులదళమును సైన్యమువెంట నడిపిరి. సేనానులయొక్కయు, రాజు యొక్కయు, మంత్రుల యొక్కయు, ముఖ్యుల యొక్కయు, అంత:పురములు సైన్యమువెంట కదలెను. అంత:పుర స్త్రీలను కాచుటకై కొంత సేనను ప్రత్యేకించిరి (కుమా. 11-5). (హిందూరాజుల యొక్కయు, ముస్లిం నవాబుల యొక్కయు యుద్ధయాత్రలలో అంత:పుర స్త్రీ లుండుట హిందూస్థాన చరిత్రలో సర్వసాధారణమై యుండెను.) ధ్వజంబు లెత్తిరి). దుందుభులు, వీరమద్దెలలు, తప్పెటలు, కొమ్ములు, డక్కలు మ్రోయించిరి. పెద్దల ఆశీర్వాదము లందిరి. సైన్యమునకు ముందు దిక్కునను, ప్రక్కలను, వెనుక భాగమునను సేనానులు నడిచిరి. సైనికులు కుంతములు, ఈటెలు, చురియలు, బల్లెములు, కత్తులు, అంబులు, గదలు ధరించియుండిరి. కొందరు "వీరసన్యాసులయిరి"; కొందరు ఇక మరల బ్రతికివత్తుమో లేదో అని ముందుగానే తమ ఆస్తిని దానము చేసి "సర్వస్వదానులయిరి". ఈ విధముగా సిద్ధమై అశ్వదళము, గజదళము, కాల్బలము, రథబలము అను చతురంగములతో శత్రువులపైబడి యుద్ధము చేసిరి. చీకటి పడగానే యుభయ సైన్యములు యుద్ధము చాలించెడివారు. (ఇది హిందువుల యుద్ధధర్మము. ముసల్మానులు దీనిని బాటింపక పలుమారు రాత్రివేళ హిందూసైన్యములపైబడి ఘోరవధలు చేసి యుద్ధముల గెలిచిరి.) రాత్రి విరామమందు యుద్ధభూమిలో చచ్చిన తమవారిని వెదకు వారును. గాయములకు కట్లు కట్టించుకొని మందులు తీసుకొనువారునునై యుండిరి. మరల తెల్లవారగనే యుద్ధము ప్రారంభమయ్యెను. ఉభయ బలంబులు పోరాడెను. శత్రుసంహార మయ్యెను. జయజయ ధ్వానములతో సైన్యము మరలెను.

ఇవి కుమారసంభవ మందలి యుద్ధ వర్ణనలలోని సంగ్రహ విషయములు. అభిలషితార్థ చింతామణిలో రాజుల యుద్ధ యాత్రా పద్ధ యాత్రా పద్ధతిని గురించి విపులముగా కలదు. (ప్రకరణము 1, అధ్యాయము 2. పుటలు 117 నుండి 172 వరకు) యుద్ధమునకు శరత్కాలముకాని వసంతముకాని ఉత్తమము. యుద్ధయాత్రకు ముందు నిమిత్తములను, శకునములను చూడవలెను. పంచాంగశుద్ధిని చూచి ముహూర్తమును పెట్టించవలెను. చతుర్విధోపాయములను ప్రయోగింప