పుట:Andrulasangikach025988mbp.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          కెలనదగు నెడ్లకొట్ట మీక్షించుకొనుచు
               నింటివెలుపలి తిన్నియ కేగుదెంచె"[1]

(అయగారి పదము నిఘంటువులలో లేదు) రెడ్ల సంసారములను, జీవనములను చాలా చక్కగా విరివిగా వేంకటనాథకవియు వర్ణించెను. (4-416, 455) ఇతడు రెడిసాని అని ప్రయోగించెను.

పురోహితుడు:-

బుజముపై మూడు తరాలనుండి భ ద్రముగా వస్తూ వచ్చిన దావళి (మడి పంచె) మరియు అసిమి సంచి, ముతక నీర్కావి ధోవతి, తల చుట్టుకొన్న చిలపుల బైరవాసము (వస్త్రము), చెమటచే గరగెడు సేనబొట్టు, మారేడు బుర్రలో మంత్రాక్షతలును, ఒక చేత పంచాంగము, పొడుపువ్రేల (చూపుడు వ్రేల) వెండి యుంగరము, మెడలో మురికి జందెములు కలిగి, హరే కృష్ణ ! హరే రామ ! అంటూ వెళ్ళినాడు. పొడుపువ్రేలు పదాలు నిఘంటువులలో లేవు. తెల్లని (ధవళ) ఉన్నితో నేసిన మడిపంచెను దావళి యందురు. ఇది మహారాష్ట్రులలో నుండు ఆచారము. సూ.రా. నిఘంటువులో ధావళి యన వస్త్ర విశేషమని వ్రాసి వేసినారు.

ఎరుకలి:-

నవరనిపని వన్నెరవిక తొడిగి, ముంజేతులపై ముఖముపై పచ్చబొట్టులు కలిగి, కురుమాపు పైటలో చిన్ని బుడుతని కట్టుకొని, తరతరాలనాటి పుత్తడి పైడిబుట్టి నెత్తిన బెట్టి, కనుబొమలసందున నామము, నొసట భూతిపూత కనులకు కాటుక, కలిగినట్టిది.[2] (పుత్తడి, పైడి రెండును బంగారు కర్థము. ఇచ్చట అది సరిపోదు. ఎరుకలి బుట్టి కర్థము కావలెను. వెదురుబుట్టీ అని యర్థముండును.) అది దారికట్టు, మొనకట్టు, స్త్రీవశ్యము కలిగించు బదనిక లమ్ము కొనెడిది. "దీనిని మా సింగడు కొండనుండి తెచ్చినాడు" అన్నది. దానిని కొరవంజీ ! అని సంబోధించిరి. సింగడు అను పదము నరసింగడు అనుదాని నుండి యేర్పడినది. చెంచులకు నరసింగడు ముఖ్యదేవత. కొరవంజి, సింగి, సింగడు యక్షగానాలలోని నటీ సూత్రధారులు దీన్నిబట్టి యక్షగానాలు చాలా

  1. శుకసప్తతి. 2-413.
  2. శుకసప్తతి. 1-97.