పుట:Andrulasangikach025988mbp.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఎక్కలిదేవికి గ్రామగంగకున్ చప్పిడిదించి మ్రొక్కుకొనుట"యు యాచారమై యుండెను[1] సిడిని గురించి యిదివరలో తెలిపినాము. భక్తి పారవశ్యమున శైవులు నిప్పుల గుండాలపై సుఖముగా నడిచెడిదియు తెలిపినాము. అరటాకు చినుగకుండ దానిపై నాట్యమాడుట యింకొక విశేషము. స్త్రీలు మూపును కోసి కండ లిచ్చుట భయంకరాచారమే. మారుగాలిచ్చుట యనవేమో ! నోరి తాళము లిచ్చుట యన నోటికి బంధనాలు వేసుకుని లేక దబ్బనాలు కుచ్చుకొని మ్రొక్కులు చెల్లించుట యని యర్థము. దేవరకు మ్రొక్కు కొనుటను తీనె లేక తిన్నె పెట్టుట యనిరి. తిన్నె, తీనె అన అరుగని శబ్దరత్నాకరమందు వ్రాసినారు. ఇక్కడ అది సరిపోదు. ఇంట్లో ఒక చిన్నకట్టపై దేవరను బెట్టి నిలుపుకొని మ్రొక్కులు చెల్లించుటకు తీనెబెట్టుట యని యందురు. ఒక రెడ్డి భార్య చనిపోయి పురోహితుని కలలో వచ్చి,

          "........ బాపడ: రెడ్డికి దెల్పరాదె, న
           న్నెన్నడు తిన్నెవెట్టి నుతి
           యించుచు గొల్వరటంచు బల్కె..."[2]

దేవర్లకింకా కొదువ లేకుండెను. పుట్టలమ్మ సందివీరులు, ఎక్కలమ్మ, పోతురాజు, ధర్మరాజు, కంబమయ్య, దేవాదులు, కాటిరేడు అనువారును వెలిసిరి.[3] చెంగలమ్మ అని మరొక దేవత యుండెను[4]. నెల్లూరిలో పూర్వము చెంగలమ్మ అనునామె సహగమనము చేసెను. ఆమె దేవత యయ్యెను. ఆ సీమలో నేటికిని చెంగలయ్య, చెంగలమ్మ పేర్లు బహుళము. దేవర్లకు మ్రొక్కుకొని 'సాత్కాలు కోరించుట' మరొక యాచారమై యుండెను[5]. సాత్కాలు అననేమో నిఘంటువులలోలేదు. నాకు తెలియదు.

రోగాలువస్తే భూతబలిగా స్త్రీలు దివదీసి నాలుగుబాటలు కలియు చోట బల్యన్నము పోసి పోయెడివారు. "శృంగాటకంబుల కాపు గరితలు అగ్గలంబుగా భగ్గునం దరికొన బలియర్చించు పొంగళ్ళవలనం గొంతకొంత సంతసింతు."

  1. శుకసప్తతి. 2-445.
  2. శుకసప్తతి. 2-446.
  3. శుకసప్తతి. 3-50.
  4. శుకసప్తతి. 3-403.
  5. శుకసప్తతి. 2-416