పుట:Andrulasangikach025988mbp.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ కాలములో మరికొన్ని గ్రామ దేవతలు పుట్టుకొని వచ్చెను. 'నయన పోలయ్య' అనున దొకదేవత. 'నయన పోలయ్యకు నంజలిఘటించి' అని యొక కవి తెలిపినాడు.[1] ఇట్టి దేవర్లకు అర్థముండదు. ఎవరయినా హాఠాన్మరణ మొందిన లేక అద్భుత మరణమందిన వారిని జనులు దేవర్లనుగా జేసి కొలుచువారు.

గ్రామగంగ మరొక దేవత. ఆ దేవతకు కాపు పడుచులు పొంగళ్ళుపెట్టి పాలుపోసిరి. దొరలు పొట్టేళ్ళ నరికించిరి. మాంత్రికులు కోళ్ళ నర్పించిరి.[2] తెనాలి రామకృష్ణుడును గ్రామగంగలను గాలిగంగ లనుపేర వర్ణించినాడు. గ్రామాధికారి గంగమ్మజాతర చేయుదినము నిర్ణయించి చాటించెను. జాతర దినము 'పామరజనుల' స్త్రీలు గోరెచ్చ చమురంటుకొని శిరస్స్నాన మాడిరి. కొత్తబట్టలు కట్టి కంట కాటుక బెట్టి, సిందూర తిలకము పెట్టి, కొప్పులో పూలు పెట్టుకొని, వేపాకు దండలు వేసుకొని, తాంబూలము వేసుకొని బయలుదేరిరి.

          "ఎడ్డెతనపు గయిసేతల రడ్డులు నడిచిరి పురస్పరద్బార్యంగా
           గుడ్డంబు చక్కి గట్టం బడ్డ మహాశక్తి దివ్యభవనంబునకున్."

ఆ యుత్సవమున మేకపోతుల బలి ముఖ్యమైనది. జనులు కల్లు బాగా త్రాగి చిందులాడిరి. ఆ జాతరలో పామరస్త్రీలు చేసిన వేడుకలను కవి యిట్లు వర్ణించినాడు.

          "సిడి వ్రేలె తెరవయోర్తు. నిప్పుటేట జరించె నెలతయోర్తు,
           చొచ్చె నిప్పుల పందిరిగుండ మింతియోర్తు. అనటాకు నర్తించె
           నతివ యోర్తు." అంతేకాదు:-

                 "కాంత యొకర్తు మూపునగండ లిచ్చె
                  మారుగా లిచ్చె నొక సుదామధురవాణి
                  లలన యొక్కర్తు నోరితాళంబు లిచ్చె
                  శక్తి జాతర సద్బక్తి శక్తు లెసగ"[3]

  1. మల్హణచరిత్ర పెదపాటి యెర్రనార్యుడు. ఆ. 2 పుట 37; ఇతడు క్రీ.శ. 17 వ శతాబ్ది వాడు.
  2. శుకసప్తతి 2-36.
  3. పాండురంగమాహాత్మ్యము. 3-75 మరియు 77 తెనాలిరామకృష్ణుడు. క్రీ.శ. 1530 ప్రాంతమువాడు.