పుట:Andrulasangikach025988mbp.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హోలీపండుగను రాయలకాలములో వసంతోత్సవమనిరి. నికలోకాంటి దాన్నిగురించి యిట్లు వ్రాసెను. "వీధులలో ఎరుపురంగు నీరుంచెడి వారు. వసంతోత్సవదినాలలో వీధులలో పోవువారి యందరి పైనను ఎవరు బట్టితే వారు రంగునీటిని చల్లుతుండిరి. తుదకు రాజుకాని, రాణి కాని ఆదారిని వెళ్ళితే వారికి ఈ సంప్రోక్షణ తప్పకుండెను [1]. వసంతోత్సవ కాలమందు నానాప్రాంత సమాగత కవులవర్ణనలు విని ఆనందించి వారికి బహుమానము లిస్తూవుండిరి.

"ప్రతివర్ష వసంతోత్స కుతుకాగత సుకవి నికరగుంబి స్మృతిరోమాంచవిశంకిత చతురాంత:పురవధూ ప్రసాధనరసికా!'[2] అని ముక్కు తిమ్మన రాయలను సంబోధించెను.

దీపావళినిగూర్చి కూడ మనకు విపులముగా తెలియవచ్చినది. విజయనగర చక్రవర్తుల కాలములో (క్రీ.శ. 1450-1550 ప్రాంతములో) రచితమైన "అకాళభైరవకల్పము" అను సంస్కృత గ్రంథములో దీపావళీవర్ణన మెక్కువగా కలదని భండార్కరుసంస్థ కధ్యక్షులగు పీ.కే. గోడేగారు వ్రాసిరి. (Annals of Bhandarkar institute, Vol. xxv1), "రాజు ఆశ్వయుజ కృష్ణ చతుతుర్దశినాడు తెల్లవారకమునుపే బ్రాహ్మీముహూర్తమందు లేచి శుచియై, బ్రాహ్మణాశీర్వాదము లందవలెను. తర్వాత బయట మంగళపంచవాద్యాలు మ్రోగవలెను. ముత్తైదువలు వారిని స్నానమునకు సిద్దము చేయవలెను. మల్లులు తలంటి గోర్వెచ్చనినీటితో స్నానము చేయించవలెను.

         "నదత్సు పంచవాద్యేషు బాహ్యకక్ష్యాంతరే తత:
          క్వణత్కంకణయా వధ్వా దరవల్గ ధురోజయా
          అభ్యక్త: స్నాపితో మల్లై: కైశ్చిత్ కోష్ణేణ వారిణా॥
"

"ఇదంతయు సూర్యోదయానికి మునుపే ముగించుకొని తర్వాత దర్బారు చేసి గాననృత్యవినోదముల నానందించి అందరికినీ బహుమతులిచ్చి మధ్యాహ్నము భుజింపవలెను. రాత్రివేళ పటాకాలను కాల్చవలెను" అని యాకల్పములో వ్రాసినారు.

  1. salatore.
  2. పారిజాతాపహరణము 1-139