పుట:Andrulasangikach025988mbp.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశపు సామంతులును వచ్చెడివారు. 1000 ఏనుగులకు రంగులు వేసి అలంకరించి పండుగదినాలలో మైదానములో నిలిపెడివారు. అందమైన ఒక పెద్దమైదానములో అయిదారంతస్థుల బంగ్లాలుండెడివి. అన్ని యంతస్థులలోను గోడలపై చిత్తరువులు వ్రాయబడి యుండెను. మనుష్యులు, జంతువులు, ఈగలు, నత్తలు కూడా చిత్రింపబడెను. అ చిత్తరువులు అతిసుందరమై కళాకాంతులతో శోభనిచ్చెను. అదే మైదానములో స్తంభాలతో కూడిన తొమ్మిది అంతస్తులమేడ యుండెను. అది సాటిలేని అందచందాలమేటిమాలె. చక్రవర్తి సంహాసనము తొమ్మిదవ యంతస్తుపై నుండెను. అది చాలా పెద్దసింహాసనమై, సువర్ణమయమై, రత్నాలతో నిండినదై యుండెను. దాని అందాన్ని అలంకరణాన్ని చూచి ప్రేక్షకులు ముగ్ధులవుతూ వుండిరి. ఆ సింహాసనముపై ఆసీనుడై చక్రవర్తి దసరావేడుకల నవలోకించెడివాడు. ఆ యుత్సవము మూడుదినాలు జరుగుతుండెను. వేషగాండ వినోదాలు, గారడివారి ప్రదర్శనాలు, భోగంవారి ఆట పాటలు చక్రవర్తియెదుట ప్రదర్శింపబడుతుండెను."

పీస్ అనువా డిదే యుత్సవమును విపులముగా వర్ణించినాడు. పై విషయములతో పాటు మరికొన్ని యిట్లు తెలిపినాడు.

"జెట్టీలు కుస్తీలను ప్రదర్శించిరి. రాత్రులందు బాణసంచాలను కాల్చుతుండిరి. అందు నానావిగ్రహాలు, వాటినుండి పటపటమను బాణాలు ఆకాశాని కెగిరి. పగులుచుండెను. కాళీశక్తికి నవరాత్రులలో ప్రతిదినము 24 దున్నపోతులు, 150 మేకలు బలి ఇచ్చుచుండిరి. తుది దినమునాడు 250 దున్నలను, 400 మేకలను బలియిచ్చిరి. ప్రతిదినము బ్రాహ్మణులు దేవీపూజలు చేసిరి. గుర్రాల నలంకరించి ఊరేగించిరి."

ఒకతడవ కృష్ణరాయలు స్వయముగా ఒక అడవిదున్నను వేటాడి పట్టుకొని వచ్చెను. దానిని దేవీనవరాత్రులలో దేవికి బలి యియ్య నేర్పాటు చేసెను. ఆచారప్రకారము ఒకే ఒక కత్తి వ్రేటుతో దున్నతల తెగిపడవలెను. తెచ్చిన యడవిదున్న ఏనుగంతటిది. దాని కొమ్ములుసాగి తోకను తాకుచుండెను. అంతటి జంతువును ఒకేవ్తేటుతో నరకుటకు వీరులందరును వెనుక ముందాడిరి. అప్పుడు విశ్వనాథనాయకుడు ఖడ్గము తీసుకొని సులభముగా ఒక్క కత్తిఊపుతో దాని తలను ఎగురమీటెను.[1]

  1. Salatore II