పుట:Andrulasangikach025988mbp.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనుల వినోద విలాసము

పండుగలు జనులకు ఉత్సవకాలాలు. ఆనాటి పండుగలే యీనాడును కలవు. అదంతగా భేదము లేదు. ఏరువాక పున్నమ వ్యవసాయకులకు ముఖ్యమైనట్టిది, పలువురు ఏరువాక అనగా ఏరులు వచ్చేకాలమందు చేయు పండుగ అని పత్రికలలో పెద్దపెద్ద వ్య్సాలు వ్రాసివేస్తూ ఉన్నారు. ఏరు అనగా నాగలి. ఏరువాక సాగించుట అనగా దున్నుట కారంభించుట. జ్యేష్ఠపూర్ణిమనాడు ఎద్దులను కడిగి రంగులతో అలంకరించి నాగండ్లకు ఎర్రమన్ను సున్నం పట్టెలు వేసి నూనెరంగులు పూసి చీరలు కట్టించి సొమ్ములు పెట్టి సాయంత్రము మంగళ వాద్యముతో నాగళ్ళను గొర్రులను బుజాలపై తీసుకొని ఎద్దులతో ఊరేగి పొలాలకు పోయి దుక్కి ప్రారంభము చేసి వత్తురు. ఆనాడు భక్ష్యభోజ్యములతో గాటికి నై వేద్యమిత్తురు. ఇది ఏరువాక పున్నమ పండుగ. ఇది వైదికోత్సవమే! సందేహములేదు! "జ్యేష్ఠమాసస్య పౌర్ణిమాస్యాం బలీవర్దాన్ అభ్యర్బ: ధావంతి పోయం ఉద్పృష భయజ్ఞ:" అని జైమినీ న్యాయమాలలో నుదాహృతము.

          "కాలుని దున్ననంది నయి గంటలు దున్నక మంటినా, మహా
           కాలునినంది దున్ననయి కర్దమ మగ్నతలేక మంటినా,
           హాలికు లెన్నడున్ దెగని యౌరుల చేలును, ఔకుమళ్ళునన్
           గా, లలినేరు సాగిరిల గల్గు పసి గొని పేద మున్నుగన్." [1]

కాపులు దొరికిన దున్నలను, ఎద్దులను కట్టి గడ్డినట్లు, దుబ్బలు దున్నుట కానా డారంభించిరన్న మాట.

దసరా పండుగ రాయల యాస్థానములోను, సామంతుల యాస్థానము లందును మహావైభవముగా జరుగుతూ వుండెను. అది క్షత్రియుల పండుగ. సైన్యమునకు ప్రాధాన్యమిచ్చిన చక్రవర్తు లా పండుగను ఆకర్షణీయముగా చేయుట సమంజసమే. ఆంధ్రుల పండుగలలో విదేశీయులకు దసరా హోలీ చాలా ముఖ్యమైనవిగా గనబడెను. అబ్దుర్రజాఖ్ స్వయముగా దసరా పండుగను జూచి యిట్లు వ్రాసెను.

"చక్రవర్తి తమపాలెగాండ్రను, నాయకులను, అందరిని తన నగరానికి పిలిపించుకొనుచుండెను. మూడునాల్గునెలల ప్రయాణము చేయునంతటి దూర

  1. ఆముక్తమాల్యద 4 - 124.