పుట:Andrulasangikach025988mbp.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చికిత్సలు చేసుకొనిరి. కొంగవలె వంకరగా నుండు మాదిగకత్తిచేత బుజములు చీలినప్పుడు వైద్యులచే కుట్టు వేయించుకొనిరి. తలపై దెబ్బలు పడి చీలగా పాతగుడ్డల కాల్చి దానిమసి నందు పూసి తాత్కాలిక చికిత్సలు చేసుకొనిరి. వైద్యుల వేషము, వారిశాస్త్రమునుగురించి యింతకుముందే తెలుపనైనది.

అప్పుడప్పుడు క్షామ మేర్పడినప్పుడు పూర్వకాలమందు జనులు చాలా కష్టపడెడివారు. పలువురు ఆకలిచే చచ్చిరి. పలువురు పిల్లల కూటికై అమ్ముకొనిరి. మన కాలమందే 1941 ప్రాంతములో బెంగాలు క్షామము వల్ల 20 లక్షల జనులు చావలేదా! రైళ్ళు, రోడ్లు, మోటారులు లేని ఆ కాలములో క్షామబాధ లెట్టివీగా నుండెనో యూహించు కోవచ్చును. ధాన్యము దొరకక జనులు ఊదర్లు ఈతగుజ్జు మొదలయినవి తినిరి.

           "గునుగు లూదర్లు బరపటల్ గోళ్ళగొండు
               లల్లిబియ్యంబు వెదురుబియ్యంబుగొట్టె
            చెట్లు నింజెట్లు తుంగముసైయలు నీత
               గుంజు మొదలుగ దిన దొరకొనియె జనము
            అరువడు గంపెతవిందయ లరువది
               దినములకు బండునని బ్రతుకాసన్
            తరచుగ నేతా లెత్తగ బరిపరియై
               యవియు మల్లెపడి చెడిపోయెన్."

పెద్దపెద్దగ్రామాలలో వారపుసంత లుండెను. వర్షాకాలములో అవి సరిగా సాగనేరకుండెను.([1]) సంతకు తిరుగు బేపారులు గుర్రాల నుంచుకొని వానిపై నెక్కి వెళ్లుతూ వుండిరి. "ఊరూరి సంతకుం దిరుగ పెద్ద లింటింట సంతరించు పిలుకువాటు గోడిగ జావడములు" వారి కుండెను([2].)

విజయనగర రాజ్యములో కృష్ణదేవరాయలును, తదితర చక్రవర్తులును సత్రాలు కట్టించి యుంచి బ్రాహ్మణులకు ఉచితముగా భోజనము పెట్టుతూవుండిరి. ([3])

  1. సంతల కూటములకు విచ్చు మొగ్గలొదవె" ఆము. 4 - 123.
  2. ఆముక్తమాల్యద 4 - 35.
  3. రాధామాధవం. 3 - 85.