పుట:Andrulasangikach025988mbp.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తర్వాత గ్రామపెద్దల రచ్చకట్ట పంచాయతిలో వారిని విచారించి పెద్దలిచ్చిన శిక్షను అపరాధులపై విధిస్తూవుండిరి. అపరాధులను నిర్బంధములోనుంచి వారిచే భవనాలకు, కోటల నిర్మాణాలకు సున్నము రాళ్ళు మోయించెడువారు. [1]

          దొంగలు తప్పు నొప్పుకొననిచో,

         'ఇడుమ కట్టున వేడి యెండలో మిగుల జడియ వీపులమీద చాపరాలెత్తి
          పొగడదండలువైచి పోనీక యెదుట బెగడ దిట్టుచు నడ్డపెట్టి....' [2]

బాధించెడివారు. ఇడుమకట్టున అన ఇంటిముందట యని యర్థమను కొందును. పొగడదండ అనుపదమునకు శ. ర. లో అర్థములేదు. తప్పు చేసినవారికి పొగడపూలదండ వేసి పూజించి ప్రార్ధించి తప్పు నొప్పించు కొనరుకదా! శ్రీనాథునికిని చేతికి కట్టెకోడెము వేసి వెదురు గూటముతో బిగించి గుండు నెత్తించి వీపున బండలు వెట్టిరి. అ శిక్షలలో పొగడదండను కూడా వేసి శిక్షించిరి.

         'కవిరాజుకంఠంబు కౌగిలించెను కదా పురవీధి నెదురెండపొగడదండ'

అని యతడు దు:ఖించెనుగదా! ఇచ్చటకూడ వేడియెండలో నిలబెట్టి బండలెత్తి పొగడదండలు వేసిరన్నారు ఒక్క పొగడదండకాదు, పొగడదండలు అవి అన్నారు. అవేటివి? అవి పొగడపూలవలె నుండు యినుపసంకెళ్ళో లేక త్రాళ్ళో అయియుండును. నేటికిని అప్పులు చెల్లించనివారిని మెడకు త్రాడో సెల్లానో చుట్టి లాగుకొనిపోవుదురు. మెడపట్టి లాగింతుమనుటయు కలదు. రుద్రకవికృత నిరంకుశోపాఖ్యానమందు నిరంకుశుడు గుడిలో శివవిగ్రహముతో తనదియు విగ్రహముదియగు జూదమాడి, తానే గెలిచి శివుని తన పందెము చెల్లించుమనెను. విగ్రహము పలుకలేదు. పలుకకుండిన విడతునా? అని అత డిట్లనెను.

         "తగునె పన్నిద మీక యీగతి దప్పు మౌనము దాల్పగా
          తగవు నీకును నాకు బెద్దల దండ బెట్టెద జడినై

  1. ఆము. 4 - 183.
  2. పరమయోగి విలాసము ద్విపద పు. 324