పుట:Andrulasangikach025988mbp.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          గగనకేశ! యటంచు జందురు కావి సేలు గళంబునన్
          పొగడదండ యొనర్చెనా విట భూసురాగ్రణి దిట్టయై"
నిరంకుశోపాఖ్యానము, అ.3 ప.26.

దీనినిబట్టి పొగడదండ క్షణము కొద్దిగా వెల్లడి యవుతున్నది. మెడలో త్రాడో, గొలుసో, దుప్పటో, సెల్లయో పెనవేసి ఇయ్యవలసిన పైక మిచ్చు వరకు కదలరాదుసుమా! అని ఆజ్ఞ పెట్టుటకు పొగడ దండ వేయుట అని చెప్పవచ్చును. సెల్లను నిరంకుశుడు శివమూర్తి కంఠమున వైచినప్పుడు "పొగడదండయుబోలె నప్పు, గడదండ, కాలకంథరుమెడ కలంకార మయ్యె" అనుటచేత పొగడపూల దండవలె సెల్లను మెడకువేసెనని యర్థమగును.

        "......పార్వతిదవుని కంఠమునన్ దగిలించినట్టి కాం
         చన మణి రుచ్యమాన నిజ ఠాటి చెరంగులు గూడ బట్టి నీ
         పని యన నెంత వేగిరమ పన్నిద మిమ్మని దీయ నయ్యెడన్"

ఈశ్వరుడు ప్రత్యక్షమై ఓటమి యొప్పుకొని పందెపునప్పు నిచ్చుకొనెను. దీనినిబట్టి సెల్లాయంచులను కూర్చిపట్టి నీ 'పని' పట్టించెద చూడుము; లేకున్న అప్పును చెల్లించుము అని సెల్లాతో లాగెను. 'తీయ' అనగా తివియ=లాగగా అని యిచ్చట అర్థము చెప్పుకొనవలెను. ఈ కథాభాగము పొగడదండ లక్షణమును మనకు కొంత వెల్లడి చేసినది. రుద్రకవి క్రీ.శ. 1620 ప్రాంతమువాడు. ఈ 300 ఏండ్లలోనే మన పూర్వుల మాటలు, ఆచార వ్యవహారాలు కొన్ని మనకు తెలియరానివై పోయినవి. ఇంకనూ ఉపేక్షించిన మిగిలిన కొద్దిపాటి జాడలు కూడ పూడిపోగలవు.

"నేరములకు శిక్షలు చాలా ఘోరముగా నుండెను. చిన్న దొంగతనాలు చేసినవారికి ఒకకాలు ఒకచేయి నరికెడివారు. పెద్ద దొంగతనాలు చేసినవారిని గొంతుక్రింద కొండి క్రుచ్చి వ్రేలాడగట్టి చంపిరి. ఉత్తమ కులస్త్రీలనుగాని, కన్యలనుగాని చెరచినవారిని ఉరికొండిపై చంపిరి. రాజద్రోహము చేసిన పాలెగార్లను బంధించి శూలాలను పొట్టలలో పొడిచి శూలారోపణము చేసెడివారు. చిన్నకులాలవారు నేరములు చేసిన సాధారణముగా వారిని తలగొట్టుచుండిరి. అపరాధుల కొందరిని ఏనుగులచే త్రొక్కించిరి. కొన్ని అల్పపు నేరములకు అధికారులు జనుల వీపులపై బండ లెత్తించి దినమంతయు వంగబెట్టెడివారు".