పుట:Andrulasangikach025988mbp.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొంగలకు దోచుకొను అనుకూలస్థానాలు. ఈల వేయగానే దాపునుండి ఒక బాణము సంచకరముగా సాతుపై బడెను. వెను వెంటనే రివ్వురివ్వున రాళ్ళవాన గురిసెను. బాటసారులాగి హల్లకల్లోలము చెందిరి. తర్వాత దొంగలు కనబడి సాతును చుట్టివేసి కొట్టి గాయపరచి దోచుకొనిరి. బాటసారులలో కొందరు పారిరి. కొందరు మూటల చెట్లచాటున పారవేసిరి. కొందరు కొట్టవద్దు, మా స్త్రీల నంటవద్దు, కావలసిన దిదిగో అని యిచ్చిరి. కొంద రమ్ముల నెక్కు పెట్టిరి. అట్టివారి జోలికి పోలేదు. ఏమి లేనివారిని పరీక్షించి వదలిరి. ప్రొదలలో దాగినవారిని ఈటెలతో పొడిచి, వారి బట్టలను గూడా లాగికొని, పాత గుడ్డలను గోచులకై ప్రసాదించిరి. బాటసారుల చెప్పుల అట్టలను గన్నెరాకువంటి బాణాలతో చీల్చి అందేమైనా దాచిరేమో చూచిరి. ప్రయాణికులును దొంగలకు దొంగలు, చెప్పులలో, జుట్లలో, టోపీలలో, వస్తువులదాచి తీసుకొని పోవుచుండిరి. బ్రాహ్మణుడు తనశిష్యుని వానగతికి వదలి తన వరాలసంచి యొక్కయు, తన పొట్టయొక్కయు బరువుతో ఉరుకలేక ఉరికెను. బాటసారుల వెంట వచ్చిన దొంగబాటసారి వానిని వెన్నంటి కొంకులపై సురియతో నరికెను. మొలత్రాట గట్టిన వరాలసంచి దోవతిలాగి త్రెంచుకొనెను. గౌదకట్టుటోపీని విప్పి పరీక్షించెను. వాడు పొరుగూరు మాలదొంగకాన బ్రాహ్మణుడు గుర్తుపట్టి, తెలివి తక్కువతో, ఒరే యెటు తప్పించుకొందువో చూతాములే, అనిఅన్నాడు. గుర్తుపట్టినవాన్ని చంపవలసి వాడు చావగొట్టెను. అంతలో మరొకబిడారు (బాటసారులగుంపు) ఆ దారిరాగా వాడడ్డాదిడ్డి పోట్లుపొడిచి తనవారిని కలుసుకొని పారిపోయెను. ఆ బిడారులో బ్రాహ్మణుని బావ యుండెను. కాన తనను కావడిలో పట్టించుకొని పోయెను. కాని బాటలోనే బ్రాహ్మణుడు గుటుక్కు మనెను, [1]

దొంగల పట్టుటలో భటులు, వారి అధికారులు, గ్రామాధికారులు "ఘల్లు ఘల్లున గిలుకలతోడి గుదియలు" చేతబట్టిన తలారులు బాగా శ్రద్ధ వహించెడివారు. దొంగతనపు సొమ్ములను అమ్ముటను గమనించి దొంగల పట్టుచుండిరి. దొంగసొమ్ములు భోగమువారి యిండ్లకు, కమసాలులకు చేరునని మొదలు వారి నొకకంట చూచెడివారు. దొంగలు దొరకిన వారిని బాథలు పెట్టి పట్టుకారులతో హింసించి దాచినతావులను తెలుసుకొని దోచిన సొమ్ములు తెప్పించెడివారు.

  1. ఆము. అ 2. పద్యములు 7 నుండి 21 వరకు.