Jump to content

పుట:Andrulasangikach025988mbp.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలేదు. (బహుశ మరొక తరములో పూర్తికావచ్చును). దొరకినంతవరకు నేను నిర్ణయంచిన యర్థాలే బహుపదాల కందు లభించినవి. ఇంచుమించు పది పదాల కెక్కుడుగా అర్థము లభించినది. కొన్ని పదాలకు పక్షివిశేషము, క్రీడావిశేషమనియే వ్రాసినారు. పకారమునుండి హకారమువర కుండు పదాల యర్ద నిర్ణయము పూర్తిగా నేనే చేసినాను. ఈ తడవ రాజవాహన విజయము, గౌరన కృతులు, వేంకటనాథుని పంచతంమ్రు, కుమార సంభవము, వెలుగోటి వంశావళి మున్నగు గ్రంథాలను చూడగలిగితిని. అందుచేత మరికొన్ని విశేషములను గ్రంథమందు జేర్చగలిగినాను.

ఈ కాలములో 70 - 80 ఏండ్ల వృద్ధులకు వారి చిన్నతనమునాటి ఆచారములు తెలిసినట్టివి మనకు తెలియవు. మనకు తెలిసినంతకూడా మన సంతతికి తెలియదు. 200-300 సంవత్సరాల క్రిందటి మన పెద్దల ఆచార వ్యవహారాలు మన మెరుగక అర్థము చేసికొనజాలకున్నాము. ఈ పుస్తకములో కొన్ని విషయములు తెలియరానివని వ్రాయవలసి వచ్చెను. మన పరిషత్తుల సంచాలకులు, గ్రంథ ప్రదర్శనము, కళా ప్రదర్శనము, పురాణ వస్తుప్రదర్శనమును గావించుతున్నారు. కాని మనవారిలో పూర్వమందు ఆచార వ్యవహారములందుండిన వస్తువులను సేకరించి ప్రదర్శించుట చాల యవసరము. పుస్తకము లుంచి చదువుకొను కట్టెతోచేసిన వ్యాసపీట, తాటాకుల పుస్తకాలు, గంటములు, బొండకొయ్య, కోడెము, పొగడదండ, పూర్వపు చిత్తరువులు, నిటివంటివాటిని నిరూపించు పటాలు, పూర్వమువారి రూపాలను, దుస్తులను, వేషాలను తెలుపు పటాలు, ప్రాచీన నాణెములు, గడియారపు కుడుక, పూర్వకాలపు చెండ్లు, కవిలె కడితము, పాచికలు, కోళ్ళ చరణాయుధాలు, ముక్కరవంటి మాయమగుచున్న స్త్రీల యాభరణములు, బొందెల అంగీలు, చల్లాడములు, కుల్లాయి, కబ్బాయి, ఆయుధాలు. కవచములు, మసిబుర్రలు, గలుగుకలాలు, పూర్వ ప్రముఖుల చేతివ్రాతలు, దొంగల పరికరాలు, రంగులు, బాలబాలికల క్రీడలు, రొక్కపు జాలెలు, నడుము దట్టీలు, అసిమిసంచి, తోలుబొమ్మలయొక్కయు, యక్షగానాల యొక్కయు దృశ్యములు, గాజుకుప్పెలు, వివిధప్రాంతాలలో పూర్వము సిద్ధమగుచుండిన సుందరవస్తువులు, సంగీత పరికరములు మున్నగునవి సేకరించి ప్రదర్శించవలెను. వాటిని ఒక మ్యూజియములో నుంచవలెను. పైవాటిలో సగాని కెక్కువగా ఈ కాలమువారు చూచి యెరుగరు. పై వాటిలో అనేక