పుట:Andrulasangikach025988mbp.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
  • [1] శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు గొప్ప విద్వాంసులు, పరిశోధకులు, విమర్శకులు. వారు నా కిట్లొక కార్డు వ్రాసిరి.

"మీ గ్రంథము - ఆంధ్రుల సాంఘిక చరిత్ర - చాల ముచ్చట గొల్పినది. మీరీ గ్రంథము రచించుటకు ఎల్లతెఱగులను సమర్థులు. ఆదినుండి తుదిదాకా ఒకతూరి స్థూలదృష్టితో చదివి యిది వ్రాస్తున్నాను.......చదివినంతలో మీరు ప్రామాణికులైన నత్యరతులైన పవిత్రహృదయులని గుర్తించినాను. నేను, మీరీ గ్రంథమును ఇంతకింకను నాల్గయిదు రెట్లు విషయవిశేషములతో ప్రపంచించి పునర్ముద్రణము చేయుటకు, తోడ్పడ కుతూహలపడుచున్నాను - వేటూరి ప్రభాకరశాస్త్రి, (తిరుపతి, 28-11-49)"

శ్రీ శాస్త్రిగారికి నేను వెంటనే జాబు వ్రాస్తిని కాని అది వారి కందినట్లు లేదు. వారినుండి ప్రత్యుత్తరము రాక పోవుటయే నిదర్శనము. వారి ఆశీస్సునకు నా నమోవాకములు. ఈ మూడు విమర్శలు తప్ప తక్కినవి నే నెరుగను.

ఈ తడవ ముద్రించినదానిలో కొన్ని మార్పులు చేసినాను. "తూర్పు చాళుక్య యుగము" అను నొక క్రొత్త ప్రకరణమును చేర్చినాను. మొదటి గ్రంథము వ్రాసినప్పుడు పాచికల ఆటను గురించి శ్రద్దచేయలేదు. ఈ తడవ దానిని సమగ్రముగా గ్రహించి వ్రాసినాను. మొదటి ప్రచురణ కాలమందు నాకు కొన్ని పదాలు సరిగా తెలియరాక సరిగ వ్రాయకయో, సూచించి తప్పించుకొనుటయో లేక వదలివేయుటయో జరిగెను. ఇప్పుడు వాటిని సరిగా గ్రహించి ఇందెక్కించినాను. అట్టివాటిలో బొమ్మకట్టుట, కనుమూరి, గిల్లదండ (వీటి ఖేలనము), రణముకుడుపు, పరువుల క్రోవి, ముడాసు, తలముళ్ళు మొదలయినవి చూడదగినవి. ముఖ్యపదముల అకారాదిసూచి గ్రంథాంతమం దియ్యనైనది. దానినిబట్టి పై పదములను విద్వాంసులు పరికింతురని ప్రార్థన.

మొదటి ప్రచురణ కాలములో నేను శబ్దరత్నాకరము, ఆంధ్ర వాచస్పత్యంబును చూచి అందులేని పదాలకు నాకు తోచిన లేక తెలిసిన యర్థాలను వ్రాస్తిని. ఈ తడవ సూర్యరాయాంధ్ర నిఘంటువును చూడగలిగితిని. అందు నకారాంతమువరకు పదాల కర్థాలు కలవు. తక్కినభాగ మింకను ముద్రితము

  1. * శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగా రిటీవలనే పరమపదించిరి. వారి యీ లేఖ నాకు మొదటిదియు, తుదిదియు.