పుట:Andrulasangikach025988mbp.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైదేశిక బేహారులు చేసిన దేశ దేశ వ్యాపార మెట్టిదనగా:-

        "కొంకక జీవి పైగో వరకంగు లంక యయోధ్య మలాక యీడాము
         మొదలైన దీవుల మునుకొని వచి"[1]

ఇందు మొదటిపంక్తి అంతయు తప్పుగా కనబడును. చీని, పెగూ, అరకాన్ అను దేశాల అ పేరులని తెలియక లేఖకులు అడ్డాదిడ్డముగా వ్రాసినట్లున్నది. లంక అనునది సింహళము. మలాక మలయాలోనిది. ఈడాము అనగా అరేబియా రేవు పట్టణమగు ఏడెన్ అయి యుండును.

విజయనగరములో కొందరు 5 లక్షల జనులుండిరనియు, అంతకంటే చాలా యెక్కువగా నుండిరని మరికొందరును తెలిపినారు. అట్టి నగరములో వ్యాపారము చాలా విరివిగా నుండెను. వ్యాపారులు కందులవలె రత్నాలరాసులు పోసి అమ్ము చుండిరని ఆకాలపువారు వ్రాసిరి. నగరవాసుల వైభవములు అనంతముగా నుండెను. అట్టివాటికై విలాస వస్తువులు సమృద్ధిగా అమ్ముతూ వుండిరి.

పరిశ్రమలు

ఇదే సందర్బములో జనుల యవసరాలకై యే యే వస్తువులు సిద్ధమయ్యెనొ తెలుసుకొందుము. సాధారణముగా శూద్రులలో బహుజనులు రాటములపై నూలు వడులుచుండిరి. దానిని నేయువారు సాలెవారు. వారిలో బహుశాఖలుండెను. సాలె, పద్మసాలె, అగసాలె పటుసాలె మున్నగు వారుండిరి. "అవ్వీటి మేటిసాలె, అగసాలె, పటుసాలె, వానె, వైజాతి, సాతులు, ఏతుల కొమరులు"[2] అనువారుండిరి. పటుసాలె లన పట్టువస్త్రములను నేయువారు, వానె అన ఒకజాతి కోమటు లని యర్థము వ్రాసినారు. వణిక్ అను దానినుండి యేర్పడినదేమో? వైజాతియన వైశ్యజాతి యని రెడ్డిరాజ్యకాల చర్చలో తెలిపినాము. సాతులన గోనెలు నేయు పెంకెవారు. ఏతుల అన చాప లల్లెడువారు. ఈపదము ఏతులు అనియో, ఏతుల యనియో సరిగా తెలియదు.

విజయనగరములో కొల్లలుగా గులాబీపూల నమ్ముచుండిరి. జనులకు సుగంధాలపై చాలా వేడుక. కస్తూరి, కుంకుమపూవు నలుగులో నూరి వాడిరి.

  1. పరమయోగి విలాసము పు 488.
  2. ఆముక్త మాల్యద. 4-35.