పుట:Andrulasangikach025988mbp.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేటికిని సాము గరిడీలలో పై యాచారవిధానములే వర్తిస్తున్నవి. వీరుల స్మారకార్థమై వీరగల్లులను స్థాపించిరి. అట్టివి నేటికిని చాలాపల్లెలలో కాన వస్తున్నవి.[1]

ఏదైనా యుద్యమము సాగించినపుడు జనులు శకునము జూచెడి వారు. అదేవిధముగా రాజులు యుద్ధమునకు బయలు దేర సంకల్పించి నప్పుడు తెల్లవారు కాలమున వీధులలోనో, నగరోపాంతమందో శకునముల గమనించెడివారు. దానిని ఉపశ్రుతి అనిరి. శ్రీ కృష్ణదేవరాయలు కటకము (ఓడ్రదేశము) పై దండయాత్రకు వెళ్ళుటకు ముందు ఉపశ్రుతిని విచారించు కొనిరి. ఆనాడు తెల్లవారుటకు ముందే ఒక చాకలి మైలబట్టలను బండపై ఉతుకు లుతుకుచూ అదే తాళముగా ఈవిధముగా పాడుకొంటూవుండెను.

          కొండవీడు మనదేరా ! కొండపల్లి మనదేరా !
          కాదని వాదుకు వస్తే కటకందాకా మనదేరా !

వెంటనే అతడు సైన్యాలతో బయలుదేరెనట ! చాకలివానికి కూడా పర దేశాలన్నీ "మనవేరా" అనునంత రాజ్యాభిమానము ప్రశంసకు పాత్రము.

బిదరు పట్టణములో బరీదు సుల్తానుల కాలమునాటి కోటలు, రంగీన్ మహల్, చీనీమహల్ మున్నగునవి కలవు. రంగీన్ మహలును అలీబరీద్ అను సుల్తాను (1540-79) కట్టించెను. అచ్చట కోటలో లభించిన ఇనుపముండ్లను కొన్నింటిని ఆర్షశాఖవారు కూర్చి యితర యుద్ధపరికరాలతోపాటు నుంచినారు. ఇనుపముండ్లను ఉర్దూలో గోఖ్రూ అందురు. కన్నడములో లగన్‌ముళ్లు అందురు.

  1. Salatore, II.