పుట:Andrulasangikach025988mbp.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెనుగువారికి సమరాశ్వముల లోపము చాలా గొప్పలోపము. గుర్రముల ప్రాముఖ్యమును విజయనగర రాజులు, రెడ్డి వెలమరాజులు బాగా గుర్తించి వాటి కెంత వ్యయమైనను భరించి తమ సైన్యమందు చేర్చిరి. కాని కొందరు తప్ప తక్కినవారు గుర్రపు సవారిలోను, దానిపై యుద్ధము చేయు నిపుణతలోను తురకలకన్న తక్కువ యైనవారే. హిందూరాజులు ఆశ్విక దళములో నెక్కువగా ముసల్మానులనే చేర్చవలసిన వారైరి.

సైన్యములో భటులకు కుస్తీలు, ఆయుధ ప్రయోగమును, సవారి మున్నగునవి బాగా నేర్పెడివారు. శ్రీకృష్ణదేవరాయలు మంచి సాములో సవారీలో ఆరితేరిన జెట్టీలలో మేటిజట్టి. ప్రతిదినము కుసుమ నూనెను చిన్న గిన్నెడు త్రాగి అదే నూనెతో అంగమర్దనము చేయించుకొని సాముచేసి, సవారిచేసి, కుస్తీలు పట్టెడివాడని పీస్ అను విదేశీ వ్రాసెను.[1]

ఆ కాలమందు స్త్రీలుకూడా మంచి జెట్టీలుగా సిద్దమై కుస్తీలు జేసిరి. క్రీ.శ. 1446 నాటి యొక శాసనములో హరియక్క అను నామె తన తండ్రిని కుస్తీలో చంపిన జెట్టీలతో కుస్తీచేసి వారిని చంపి పగదీర్చుకొనెను.[2] జనులకు సాముచేయుటలో ఆసక్తి యుండెను. జానకి త్రాటి తుపాకి ప్రయోగములోనికి వచ్చినను కత్తి యుద్ధమున కింకను ప్రాధాన్యముండెను. అందుచేత జనులు కుస్తీలు, కత్తిసాము, కట్టెసాము, సవారి మున్నగునవి నేర్చుకొనిరి. వాడవాడలలో సాము గరిడీలు (తాలీంఖానాలు, అఖాడాలు) ఉండెను. సాము సాలెలతో భూమిని లోతుగాత్రవ్వి మన్నుతీసివేసి అందిసుక సగమువరకు నింపి పై భాగమును ఎర్రమట్టితో నింపెడివారు, అట్టిరంగమందు సాము నేర్చుటకు కావలసిన గదలు (ముద్గరములు-వీటినే వర్ణ వ్యత్యయముతో ఉర్దూలో ముగ్దర్ అందురు.) సంగడములు (వీటి నుర్దూలో సింగ్ తోలా అనిరి. అవి మధ్య ఇరుసు, ఇరుప్రక్కల చిన్న రాతి చక్రములు కలవి.) ఉండెడివి. సాములోను, కుస్తీలోను బాగా గడితేరిన వారిని జెట్టీలనియు హొంతకారులనియు పిలిచిరి.[3]

  1. Salators, II.
  2. Salators, II.
  3. మనుచరిత్ర 5 - 59. ఇందు సూర్యాస్తమయ వర్ణన కలదు. దాని నుండి పై విషయాలు తేల్చనైనది. రాధామాధవము 3 - 89 నుండియు ఇది వెల్లడి యవుతున్నది.