చెప్పబోయిన దేమన:- అర్ధముకాని ప్రాంతీయ ప్రాబంధిక పదాలను పట్టికగా ముద్రించి తెలిసినవారు అర్ధములను వ్రాసి పంపుటకై భారతి వంటి పత్రిక కృషిచేసిన, లేక (తెలంగాణా) ఆంధ్ర సారస్వత పరిషత్తువంటి సంస్థలు ప్రయత్నించిన కాలగర్బమందు సమాధిపొందిన యెన్నియో సుందర భావస్ఫోరకములగు పదాలకు సుధా సేచనము చేసినట్టగును. నిఘంటు నిర్మాతలు గ్రాంథిక పదాలనే సేకరించుటకై మడిగట్టుకొన్నవా రగుటచేత వారిశ్రమ పూర్ణఫలదాయి కాకపోయినది. సూర్యరాయాంధ్ర నిఘంటువు నించుమించు రెండు తరాలనుండి వ్రాస్తూవచ్చినను వారు వ్యావహారికమన్న చీదరించుకొందురని వినుటచే వారి శ్రమ తగినంత ఫలవంతము కాదనవలెను. ఏ నిఘంటువైనను సరే ఎంతవరకు వ్యావహారిక ప్రాంతీయ పదాలను సేకరించరో అంతవర కది కొరవడినదై యుండును.
మన సాంఘిక చరిత్రకు పనికివచ్చు
తెనుగు ప్రబంధాలలో ముఖ్యమైనవి
పాల్కురికి సోమనాథుని - బసవపురాణము, పండితారాధ్య చరిత్రము.
శ్రీనాథుని (వల్లభరాయని) - క్రీడాభిరామము.
శ్రీనాథుడో (కాడో!) - పల్నాటి వీరచరిత్రము.
కొరవి గోపరాజు - ద్వాత్రింశత్సాలభంజికలు.
కృష్ణదేవరాయల - ఆముక్తమాల్యద.
తాళ్ళపాక తిరువెంగనాథుని - ద్విపద పరమయోగి విలాసము.
సారంగు తమ్మయ్య - వైజయంతీ విలాసము.
గౌరన - హరిశ్చంద్ర ద్విపద.
కదిరీపతి - శుకసప్తతి.
వెంకటనాథకవి - పంచతంత్రము.
శతకములలో - వేమన, చంద్రశేఖర, కుక్కుటేశ్వర, రామలింగ, శరభాంక, వేణుగోపాల, వృషాధిప, సింహాద్రి నారసింహ, వెంకటేశ, గువ్వలచెన్న శతకాలు.
భాషీయ దండకము.