పుట:Andrulasangikach025988mbp.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలపు కవుల గ్రంథాలను పూర్తిగా చదివి అందు స్ఫురించిన యంశములను గుర్తుగా వ్రాసుకొని తర్వాత సలటోర్ అనునతడు వ్రాసిన విజయనగరరాజ్య సాంఘిక చరిత్ర అను ఇంగ్లీషు సంపుటముల రెంటిని చదివితిని. నేను గుర్తుంచుకొన్న పలువిషయములును వాటిలో నివియును సరిపోయెను. పైగా ఆ గ్రంథ కర్తకు తెనుగు రానందున నా సంగ్రహమందు కొన్ని యెక్కుగా కానవచ్చెను.

     "ఉరుసంధ్యాతప శోణ మృత్కలితమై యొప్పారు బ్రహ్మాండ మన్
      గరిడిన్ కాలపుహొంతకాడు చరమాగ స్కంధముం జేర్చు ని
      బ్బరవున్ సంగడమో యనన్ శశి డిగెం బ్రాగ్బూమి భృత్కైతవే
      తర బాహాగ్రపు సంగడం బనగ మార్తాండుండు దోచెన్ దివిన్"
                                         మనుచరిత్రము. 3-59.

అను ప్రాత:కాల వర్ణనమునుండి ఆ కాలమందు సాము గరిడీ లుండెననియు, అందు ఎర్రమట్టిని నింపిరనియు, అందు సంగోలా మున్నగు సంగడము లుండెననియు, జెట్టీ లీ విధముగా సిద్ధమగుచుండి రనియు వ్రాస్తిని. విజయనగర కాలమందు సాముకూటములు విరివిగా నుండెననియు కృష్ణదేవరాయలే ఒంటికి నూనె పట్టించి జెట్టీలతో కుస్తీ పట్టెడివాడనియు విదేశియాత్రికులు వ్రాసినదాని వలన ప్రాతఃకాల వర్ణనమునుండి తేల్చిన విషయము సరిపోయినది. ఈ విధముగా అడు గడుగునకు కవుల వర్ణనలనుండి మనకు కావలసిన విషయము తేల్చవలసి యుండును.

సాంఘిక చరిత్రకు పనికివచ్చు కావ్యాలలో ప్రాంతీయ పదములను ప్రయోగించినారు. కదిరీపతి శుకసప్తతిలోని ఇంచుమించు 100 పదాలు నిఘంటువులలోలేవు. (నేను సూర్యరాయాంధ్ర నిఘంటువు జూడలేదు. కాన దాన్ని గురించి వ్రాయుటలేదు.) అందలి పదాలను కడప, అనంతపురము వారలను విచారించి తెలుసుకొనవలసి వచ్చెను. చంద్రశేఖర శతకములోని వ్యావహారిక పదాలు నెల్లూరువారి కర్థమగును. భాషీయదండక పదాలు కర్నూలువారి కర్థమగును. ద్వాత్రింశత్సాలభంజికా కథ లందలి పదాలు తెలంగాణమువారి కర్థమగును. క్రీడాభిరామ మందలి పదాలు కృష్ణాజిల్లావారి కర్థమగును. పాల్కురికి సోమనాథుని, నన్నెచోడుని పదాలు కొన్ని యెవరికిని అర్థము కావు.