పుట:Andrulasangikach025988mbp.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్లెజనులుగూడా ఎరుగరు. కేరిజము అను పదము శబ్దరత్నాకరకారుడు కేరజము అని వ్రాసి 'ఒకానొక పక్షి' అని దానికర్థము వ్రాసినాడు. పూరేడు అన పక్షి విశేషము అనియు తెలిపెను. కొక్కెరఅనగా కొంగయేగాని, కొంగలనుకూడ కవి వర్ణించినందున అందలి భేదములని యెరుగవలెను. కక్కెర అన పక్షి విశేషము అనియే నిఘంటువులో తెలిపినారు. కారుకోడి అన అడవికోడి. గొరవంకలను తెనుగులో బట్టిడిగాడు అనియు, సంస్కృతములో శారిక అనియు నందురు. చెమరబోతు అను దాని కర్థము శ.ర. నిఘంటువులో లేదు కాని చెమరు అనుదానికి చెమరుకాకి యని వ్రాసినారు. ఈపక్షి నీలము వన్నె కలదై కాకికన్న చిన్నదై, తోకపొడవుగా కలదై, ద్వనికూడా కాకితో భిన్నించినదై పెద్దరాళ్ళను గోడలు కట్టువారు మలిచినప్పుడగు కంగ్, కంగ్ అను ధ్వనినిబోలి కూయునదై యుండెను. కౌజు పిట్టలను కొందరు సాకి పంజరాలలో పెట్టి పొలాలకు తీసుకొనిపోయి ఉరులొడ్డి యుంతురు. వాటి ధ్వనికి సజాతీయములగు కౌజుపిట్టలు కలహించుటకై వచ్చి ఉరులలో చిక్కి దొరకిపోవును. స్వజాతితో కలహించు పిట్టలలో కోళ్ళు, కౌజులు, పికిలి పిట్టలు (బుల్ బుల్) ముఖ్యమైనట్టివి.

మన భాషలో పక్షి చరిత్రలు లేనేలేవు. సంస్కృతమందును శ్యేనశాస్త్ర మొకటి కలదు. అదున్నదని యెరిగిన సంస్కృత పండితులే యరుదు. నిఘంటువులలో ఆయా పక్షుల చిత్రములను ముద్రించి వానిజీవిత విశిష్టతలను కొద్దిగా తెలుపవలెను. కాని పక్షి విశేషము, జంతు విశేషము, క్రీడా విశేషము, అని వ్రాసివేస్తే ఏమిలాభం ? ఇంగ్లీషులో ఈనాడు కాదు 150 ఏండ్లక్రిందట, ఇంకేమైనా అంటే అంతకు పూర్వమే, పక్షులను గురించిన గ్రంథములు ఒకటి రెండు కాదు, నూర్లకొలదిగా సచిత్రముగా, సమగ్రముగా వ్రాసి ముద్రించిరి. మన దేశములో ఒక్కరయినా పక్షి జీవితములను గమనించినారా ? ఒక్కానువాద గ్రంథమైనను (పక్షులనుగూర్చి పిల్లల వాచకాలుతప్ప) ముద్రించిరా ? అందుచేత ప్రాచీన కవు లిట్టి పద్యాలను వ్రాస్తే వాటి కర్థమువ్రాయు నిఘంటుకారులు పక్షి విశేషమని తప్పించుకొనిపోవుటయు, మన కర్థము కాకపోవుటయు సంభవిస్తున్నది.

ఇతర ప్రబంధాలలో నాచన సోముని మొదలుకొని పలువురు కవులు వేటను వర్ణిస్తూ వచ్చినారు కాని పక్షుల వేటలను వర్ణించిన కవు లరుదు. అందు చేత పైన నుదహరించిన పద్యము విలువకలదే ! "బురుక పిట్ట యింతగానిలేదు" అని యీ కవియే (సిం.ద్వా. భా. 2 పు 20) వర్ణించెను.