పుట:Andrulasangikach025988mbp.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భటులను-సిపాయీలను-ఆకాలములో జట్టీలంటూ ఉండిరి. తర్వాతి కాలములో ఇంగ్లీషు ఫ్రెంచివారు ప్రవేశపెట్టిన మిలిటరీ యూనిఫారంవలె పూర్వము యుద్ధభటులకు వేషాలు సరిగాలేకుండెను. కాని వారికిని కొంత ప్రత్యేక వేషమందుండెను. తలకు చుంగుల రుమాలయు, ముందు చుంగులు వెనుక బిగించిన ధోవతి లేక చల్లాడము (చల్లడము, చిల్లడము) అను 'నిక్కర్‌' వంటి మోకాళ్ళపై లాగును, నడుములో రంగుకాసె దట్టీయు (పట్టి), ఆదట్టీలో కత్తులు కఠారులును, చిన్నవి, చిక్కని అంగీయు, వీపున డాలును, ఇవి సాధారణముగా వారి వేషాలు.

"జెట్టి అలంకరించుకొనేవరకు కోటలోగుండు (శత్రువుల ఫిరంగిగుండు) పడె" అని మన తెనుగుసామెతకూడా, యుద్ధవేళలందు జెట్టీలు యుద్ధావసరాలం కరణములను గావించుకొంటూ వుండిరని తెలియవస్తున్నది ఈ జెట్టీలను 'రాచలెంకలు', 'బంటువారు' అంటూ వుండిరి. 'బంటువానికిం గటారి చేత నున్నంజాలదె'[1] యనుటచే బంటులకు కటారి ముఖ్యాయుద మని తెలియవచ్చును.

('కరకంచు వలిపెంబు గట్టిగా గాసించి' అను పద్యములో బంటుల వేషము ఇదే ప్రకరణములో తెలిపినాను.)

ఒకనా డొకచోట వసంతోత్సవమ లు చేసుకొనుచుండ ఒక రాచలెంక గుంపునుండి వెడలివస్తూ 'తన మీసములను నంటిన సుగంధంబు విదిర్చికొనుచుండ, నెదురైన ఏకాంగ వీరుడను లెంక దురభిమానంబున గనలి,

       "ఎరా ! ముందరగానక నేరమిపై దెచ్చుకొనుచు, నీ మీసలు, నా
        చేరువ వడిపెట్టెద విది యోరీ ! యేకాంగవీరు డుంట యెరుగవే?"

అనగానే అవతలి లెంకకునూ అభిమానము నిండుకొనెను. ఉభయులు ద్వంద్వయుద్ధానికి సన్నద్ధులైరి. మధ్యవర్తులు, తుదకు రాజునూ ఎంత చెప్పినను వినలేదు. కడపట, రాజసమక్షములో ప్రజలందరు చూస్తూవుండగా వారికి కత్తితో ద్వంద్వయుద్ధము చేయుట కనుజ్ఞ యయ్యెను. అ యుద్ధములో ఓడిపోవు లక్షణాలను నిరూపిస్తూ ఒక లెంక కొన్నినిబంధనలు (షర్తులు) నిర్ణయించెను. ఆ పోటీ యుద్ధఘట్టమును కొరవి గోపరాజు యిట్లు వర్ణించెను.

  1. సింహాసన ద్వాత్రింశిక, భా 2, పు 22.