పుట:Andrulasangikach025988mbp.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరస్సులను, లీలాగృహాలను కట్టించిరని అనపర్తి శాసనము తెలుపుతూ ఉన్నది. సరస్సులనుండి చెరువులలో చెరువులలో చిన్నపడవల వేసుకొని లీలావిహారముచేసి నవాబులవలె రెడ్డిరాజులు కొందరయినా (అందు కుమారగిరి తప్పకుండ) ఆనందించిరి. కొండవీటిలో కొల్లలుగా మల్లెలు పూచి, తమ సౌరభముల వెరజల్లుతూ వుండెను. ఆ పువ్వుల పన్నీటిని వీధులలో చల్లిస్తూవుండిరని జనులనుకొందురు. అనుకొనుటయేల, వారి యనుభవముపై ప్రజలే తమకు తోచినట్టుగా పదముల కట్టి పాడుకొనిరి.

నాకు లభించిన యొక జానపద గీతికాళకల మిట్లున్నది.

          "రెడ్డొచ్చె రెడ్డొచ్చె రెడ్డొచ్చె నమ్మా !
           వీరభద్రారెడ్డి విచ్చేసెనమ్మా !
           ప్రొద్దున్నే మారెడ్డి పొర కూడిపించు
           నిలువెల్ల నడివీధి నీరు జల్లించు
           సందుగొందులలోన సాన్పు పోయించి
           చేకట్ల పసుపు కుంకుమా పూయించు
           రంగవల్లుల నూరు రాణింపజేయు
           తోరణా పంక్తులా తులకింపజేయు
           దివ్వెలను వెలిగించు దివ్యమార్గాలా
           మా పెల్లి పాలించు మంచి మార్గాలా
           ఎండలకు పందిళ్ళు వేయించుతాడూ
           పొందుగా మారేళ్ళు కోయించుతాడూ
           ఊరి బావులలోన ఉప్పుసున్నాలా
           వెదజల్లు నేటేట నిండుపున్నానా
                             రెడ్డొచ్చె.........

జనుల పరిపాలన యెంత ప్రీతిపాత్రమై, జనోపయుక్తమై, సకలానురంజకమై యుండెనో పై పాట అనేక విధాలా స్పష్టీకరిస్తుంది. ఇట్టిపాటలెన్ని అనాదృతములై మాయమైపోయెనో యేమో ! రెడ్డిరాజులకాలపుకళ నవాబు దర్జాతో కూడినదని చెప్పవలెను.