పుట:Andrulasangikach025988mbp.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సముద్ర వ్యాపారమువల్ల రెడ్డి రాజులకు చాలా గొప్ప లాభముండెను. అంతకు ముందటి అరాచక స్థితుల వలన మోటుపల్లి వర్తక మాగియుండెను. రెడ్డి రాజులు శాంతిని నెలకొలిపి, సుంకరివారు వర్తకులదోపిడి చేయకుండ సరకులపై సుంకములు నిర్ణయించి, కొన్నింటిపై తగ్గించి, కొన్నింటిపై తీసివేసి, అందరికినీ తెలియుటకై మోటుపల్లి తీరములో శాసనము వ్రాయించి యుంచిరి. అప్పటి భాష, అప్పటి వ్యాపారము తెలియజేయి నాశాసనము నిందుదాహరింతురు.

"స్వస్తిశ్రీ శకవర్షంబులు 1280 అగు నేటి విళంబన సంవత్సర శ్రావణ శు 8 మంగళవారం స్వస్తిశ్రీమతు అనపోతయరెడ్డిగారు మోటుపల్లికాపు వచ్చిన వ్యవహారాలకున్న వ్యవహారం వచ్చి కరపట్టాల దీపాంతరాల వ్యవహారాలకున్ను యిచ్చిన ధర్మశాసనం."

ఈ మోటుపల్లికి యెవరు కాపతనానికి వచ్చినను వారిని మన్నించి పెద్ద కానికె పెట్టువారము. వారికి భూమితోటి కాణాచియిచ్చువారము. వారు యెప్పుడు మరివొక తావుకు పొయ్యేమన్నాను. కాపని పట్టక అనిపిచ్చువారము. యేవూరి సరకు తెచ్చినాను తమ విచ్చలవిడి నమ్మవలసినట్లు సరుకుకొనువారికాని పోగా పునకు పల్‌సనిసర్కు ఆడపట్టేము. చీరాను, గండము, పవడము, పట్టి వ్యవహారాలకున్ను అపుత్రికమున్ను సుంకాదాయము మానితిమి. బంగారు సుంకము మానితిమి. గంధముయొక్క బది సుంకము పూర్వమర్యాదలలోను మూటను ఒకటి మానితిమి. ఈ సరకులకున్ను మెట్టసుంకాలు పూర్వమర్యాదలు క్రమాననే కొనువారము. ఈ క్రమానకు సర్వమైనవారున్ను విశ్వసించెదరు. దేవర వారికి అభస్యహస్త మిస్తిమి."

"మోటుపల్లికే వర్తకులు వచ్చి నివసింపగోరినను వారిని గౌరవించి వారలకు భూములు నివేశస్థలము లిప్పింతుమనియు వారిని నిర్బంధపెట్టి నిలుపక స్వేచ్చగా విడుతుమనియు ఏయూరి సరకు తెచ్చినను వారిని స్వేచ్చగా నమ్ముకొన నిత్తుమనియు, పన్నులకై వారి సరకులను గ్రహింపమనియు నాశాసనమున వ్రాయించి ప్రకటించిరి."[1]

  1. ఆంధ్రుల చరిత్ర, భా 3. పు 169, 170.