పుట:Andrulasangikach025988mbp.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుమార గిరిరెడ్డి సుగంధభాండాగారియు, ఉదారుడును, భక్తుడును, సరసుదులు, కోటీశ్వరుడును నగు అవచి తిప్పయ చరిత్ర శ్రీనాథుని హరవిలాసము వల్ల తెలియవస్తున్నది. అట్టి మహాధనికు లింకెందరుండిరో తెలియదు. తిప్పయ సెట్టియొక్క ఘనతను శ్రీనాథు డనేక విధముల ప్రకటించినాడు. అ సెట్టి యే యే దేశాలనుండి యే యే సరకులను తెప్పించెడివాడో యిట్లు తెలిపినాడు.

        "పంజార కర్పూర పాదపంబులు తెచ్చె
         జలనోంగి బంగారు మొలకతెచ్చె
         సింహళంబున గంధసింధురంబులు దెచ్చె
         హురుముంజి బలుతేజి హరులు తెచ్చె
         గోవసంశుద్ధ సంకుమద ద్రవము దెచ్చె
         యాంపకట్టాణి ముత్యాలు తెచ్చె
         భోట కస్తూరికాపుట కోసములు దెచ్చె
         చీన్ చీనాంబర శ్రేణి తెచ్చె
         జగద గోపాలరాయ వేశ్యాభుజంగ
         వల్లవాదిత్య భూదాన పరశురామ
         కొమరగిరి రాజదేవేంద్రు కూర్మిహితుడు
         జాణ జగజెట్టి దేవయ చామిసెట్టి."[1]

పై పద్యములో గోవా, చీని, సింహళము, హురుముంజి (పర్షియాలోని హుర్ముజ్‌రేవు) అనునవి మాత్రము మనకు తెలియును. తక్కిన వాటిని గురించి రెడ్డి రాజ్యముల చరిత్రలో ఇట్లు తెలిపినారు.

"పంజార - సుమత్రా దీవిలోని పన్‌సార్ అను పట్నము

జలనోంగి - మలయాలోనిదై యుండును.

యాంప - సింహళాని కుత్తరమున నున్న జాప్నా అనునది. దీనినే యాల్పన, యాప అనిరి.

భోట - ఇండియాలోని భూటాన్"[2]

  1. హరవిలాసము. కృత్యాది పద్యాలు.
  2. Hist. R. K. Page 409 - 412.