పుట:Andrulasangikach025988mbp.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        "బాహాదర్పమునన్ ప్రతీపధరణీ
         పాలావళిం దోలి, యు
         త్సాహోదగ్రుడు మోటుపల్లి గొని స
         ప్తద్వీప సద్వస్తు నం
         దోహంబున్ తనకిచ్చు నెచ్చెలి సము
         ద్రుం బ్రీతి కావించుచున్
         మాహాత్మ్యంబు వహించె మల్లరథినీ
         నాథుండు గాఢోదతిన్,"

మోటుపల్లి సుప్రసిద్ధ మగు ఓడరేవు. దానికి ముకుళపుర మను నామాంతర ముండెను.

ఆంధ్రులు సముద్ర వ్యాపారము విశేషముగా చేసినప్పుడు తత్సంబంధమగు సాంకేతికపదములు వాఙ్మయములో నుండవలసియుండెను. కాని యట్టివి విశేషముగా గ్రంథస్థము కాలేదు. అయినట్టివి కొన్ని కూడా జనుల కర్థము కానివై పోయెను. శ్రీనాథుడు కొన్ని నౌకాజాత్తులను పేరులను వ్రాసెను. అందుచే నాపద్యము చాలా ముఖ్యమైనది. అతడిట్లు వ్రాసెను.

         "తరుణాసీరి తవాయి గోవ రమణా
          స్థానంబులం జందనా
          గరు కర్పూర హిమంబు కుకుమ రజ:
          కస్తూరికా ద్రవ్యముల్
          శరధిన్ కప్పలి, జోంగు, వల్లి వలికా
          సమ్మన్ల, దెప్పించు నే
          ర్పరియై వైశ్యకులోత్తముం డవచి తి
          ప్పం డల్పుడే యిమ్మహిన్."[1]

పై పద్యములోని కప్పలి అరవములోని కప్పల్ పదమనియు, జోంగు అనునది తూర్పు సముద్రములోని ఓడ అనియు అపదమే ఇంగ్లీషులో (Junk) అయ్యెననియు, అవి పెద్ద ఓడలనియు, వల్లి వలికాపదాల కర్థము తెలియదనియు, సమ్మను పదము మలయా ద్వీపకల్పములో ఓడకు పదమనియు, రెడ్డి రాజ్య చరిత్రమందు తెలిపినారు.[2]

  1. హరవిలాసము కృత్యాదులు.
  2. Hist. R. K. Page 405-6.