పుట:Andrulasangikach025988mbp.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          పలము లొక్కనూరు తులయగు, తులలొక్క
          యిరువది మితి భారమిది మతంబు[1]

ఆ కాలమందలి నాణెములముచ్చటలు కావ్యాలలో కానవచ్చును. రూక[2], పసిడిటంకము[3], నిష్కము[4], గద్దె[5], (గద్యాణతద్బవము) = వరహాతో సమానము. పాతిక పరక[6] మున్నగునవి ఉదాహృతములు. ఒకరాజు ఒక సేవకునికి బాటవెచ్చమునకుగాను ఏడుదినాల కేడు మాడలిచ్చెను.[7] అనగా బంటువృత్తివారికి దినాని కొకమాడ యిచ్చుచుండిరని తెలియవచ్చెడి.

తెలంగాణములో తరీ (మాగాణి) సేద్యము నేటికిని ప్రధానమైనట్టి వ్యవసాయము. అందుచే ప్రాచీనము నుండియు రాజులు, మంత్రులు, సేనానులు, ధనికులు, ప్రజలు - కుంటలు, కాలువలు, చెరువులు విశేషముగా నిర్మించుతూ వచ్చిరి. తరీసేద్యమునకు మోట, ఏతముద్వారా, చెరువు కుంటలద్వారా నీరిస్తూ వుండిరి.

         "ఈయెడ కర్మభూమి యగు
                డెవ్వరికైనను బుద్ధినేర్పునం
          జేయగలేదు కాల మెడ
                సేసిన నేతములెత్తి, కాల్వలున్
          పాయలు, కోళ్ళు, నూతులును,
                బావులు రాట్నములున్ జలార్థమై
          చేయగ నాయెగాక మరి
               చేయనినా డవి తామె పుట్టునే.[8]

  1. సింహాసనద్వాత్రింశతి. భా. 2 పు. 31.
  2. సింహాసనద్వాత్రింశతి. భా. 2 పు. 86.
  3. సింహాసనద్వాత్రింశతి. భా. 2 పు. 99.
  4. సింహాసనద్వాత్రింశతి. భా. 2 పు. 99.
  5. సింహాసనద్వాత్రింశతి. భా. 1 పు. 28.
  6. సింహాసనద్వాత్రింశతి. భా. 1 పు. 102.
  7. సింహాసనద్వాత్రింశతి. భా. 1 పు. 64.
  8. సింహాసనద్వాత్రింశతి. భా. 2 పు. 7.