పుట:Andrulasangikach025988mbp.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        సీ. ధరియింప నేర్చిరి దర్బపెట్టెడు వ్రేళ్ళ
                   లీల మాణిక్యాంగుళీయకములు
           కల్పింప నేర్చిరి గంగమట్టియ మీద
                   కస్తూరికాపుండ్రకముల నొసల
           సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోల
                   తారహారములు ముత్యాల సరులు
           చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుముల
                   కమ్మని క్రొత్త చెంగల్వ విరులు
           ధామముల వెండియును బైడి తడబడంగ
           బ్రాహ్మణోత్తము లగ్రహారములలోన
           వేమ భూపాలు డనుజన్ము వీరభద్రు
           ధాత్రి యేలింప గౌతమీతటమునందు.[1]

వారు విప్రులకు,

"అగ్రహారావళి అఖిల మాన్యంబు లొసగి"[2]

గౌరవించిరి. "అది స్వభావోక్తి" అని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు శృంగార శ్రీనాథములో అంగీకరించినారు.

రెడ్డిరాజుల కుండిన బ్రాహ్మణభక్తి భారతదేశ చరిత్రలో వేరుచోట కాన వచ్చునో లేదో అత్యంత సంశయమే. ఓరుగంటి చక్రవర్తు లిచ్చిన దానాలు తురకవిజేతల చేతులలోనికి పోయెను. రెడ్డిరాజులు తాము గెలిచిన ప్రాంతములందంతటను పూర్వరాజులు దానము లన్నింటిని స్థిరపరిచిరి. పైగా తామున్నూ అసంఖ్యాకముగా భూములను, అగ్రహారములను బ్రాహ్మణులకు దానము చేసిరి. వీరి దానములచే ఆకర్షితులై తూర్పుతీర మందలి కృష్ణా గోదావరీ మండలములలో బ్రాహ్మణులు కొల్లలుగా నిండుకొనిరని పలువురు చరిత్రకారు లభిప్రాయ పడినారు. ప్రామాణికుడును, పూజ్యుడును, ముఖస్తుతుల నెరుగనివాడును, ప్రబంధపరమేశ్వరుడును నగు ఎర్రాప్రగడ తన యుత్తర హరివంశములో నిట్లు వ్రాసెను.

  1. భీమేశ్వర పురాణము. అ 1. ప 41. 42.
  2. భీమేశ్వర పురాణము. అ 1. ప 41. 42.