పుట:Andrulasangikach025988mbp.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు, వైజాతీయులలో వణిజ, కోమటి, వాణివ్యాపారి, వాణిజ్యవైశ్యులు, ఉత్తరాది వైశ్యులు చేరినట్టివారు. వైశ్యులకే అన్నివస్తువుల వ్యాపారముపై అధికారము కలదు. "కోమటిస్తు ధాన్య విక్రయమాత్రే అధికారోస్తియుక్తం" కోమట్లకు వడ్లవ్యాపారమే పరిమితిగా చేయబడినది. ఇవి కాంచీపురశిలాశాసనస్థ విషయములు. పదవాక్య ప్రమాణస్థానులైన మల్లినాథసూరిగారు సకల శ్రుతిస్మృతిశాస్త్రేతిహాస పురాణ కావ్యకోశాదుల నవలోడించి వైశ్య, ఊరుజ, నాగర, వణిజ, కోమటి,వాణివ్యాపారి, వాణిజ్య, వైశ్యశబ్దాలన్నియు వైశ్యశబ్దవాచకములే! యనియు , కావున వైశ్య వైజాతీయ విభేదాలకు స్వస్తిచెప్పవలసినదే అనియు జయపత్ర మిచ్చిరి."[1] మల్లినాథసూరి ఆ కాలపు వైశ్యసంఘ సంస్కర్తగా నుండెనేమో!

ఇక బ్రాహ్మణులను గూర్చి కొంత తెలిసికొందము. ఒకదిక్కు వీర శైవులు బ్రాహ్మాణాధిక్యమును పడగొట్టుటకై చాలా కృషి చేసిరి. అదేసమయములో బ్రాహ్మణాది సకల హిందూజాతులను అసహ్యించుకొను తురకలు దేశములో జొరబడి కల్లోలము చేసిరి. మరొకదిక్కు వీరశైవుల ప్రతిఘటన పటుత్వమునకై రామానుజీయులును పంచసంస్కారవిధానముచేతను ప్రపన్నత్వ సిద్ధాంతము చేతను కులకట్టుబాట్లను సడలిస్తూయుండిరి. ఇన్ని శక్తు లెదురొడ్డినను బ్రాహ్మణత్వమునకు భంగము కలుగలేదు సరికదా అది మరింత లోతుగా పాతుకొనెను. కులనిర్మూలన సంస్కరణము లన్నియు బ్రాహ్మాణాధిక్యతకు కట్టుబాటులగుటచే వారు ఆత్మరక్షణము చేసుకొన కూరకుండిరని తలపరాదు అగ్నిమిత్ర పుష్యమిత్రులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు మున్నగువారి బ్రాహ్మణ రాజ్యములు క్రీస్తుశకాదినుండి అరవ శతాబ్ద్యంతము వరకు పలుతావుల విలసిల్లెను. అప్పుడే వృద్ధస్మృతులు, ఉపపురాణాలు సృష్టియై యుండును.

ఇతర పురాణాలు అపారముగా అప్పుడే పెరిగియుండెను. స్మృతులలో హస్తక్షేపము లప్పుడే పడియుండును. అదే విధముగా రెడ్డిరాజుల కాలమందును, కాకతీయుల కాలమందును స్కాందపురాణాలు పెరిగినట్లు పలువురు చరిత్ర పరిశోధకు లభిప్రాయ మిచ్చినారు. ఆనాటి తెనుగు వాఙ్మయ మందును బ్రాహ్మణాధిక్యత విశేషముగా కానవస్తున్నది. ఈ రెడ్డియుగముననే వెలువడిన బోజ

  1. Hist R. K. Page 273.